Site icon HashtagU Telugu

KTR in US: చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై కేటీఆర్

KTR in US

New Web Story Copy 2023 08 28t113252.607

KTR in US: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) అమెరికా పర్యటన కొనసాగుతుంది. మంత్రి పర్యటనలో భాగంగా పలు సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ పలు కంపెనీలతో భేటీ అయి ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. అందులో కోకాకోలా లాంటి కంపెనీ కూడా ఉంది. అదేవిధంగా పలు ఐటీ కంపెనీలు కేటీఆర్ తో డీల్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ చికాగోలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్‌ను సందర్శించారు.

చికాగో నగరంలోని చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ (Chicago Food Innovation) ను సందర్శించిన మంత్రి కేటీఆర్.. వోరల్ బిజినెస్ చికాగో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, ఆహార పద్ధతులు, వాటి చరిత్ర వంటి అంశాలను పరిశీలించారు. సంప్రదాయ ఆహారపు అలవాట్లను కాపాడుకోవడం, ఆహార ఉత్పత్తుల సరఫరాలో చికాగో నగరం ఫుడ్ ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉందని చికాగో ఫుడ్ షాప్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఆధునిక జీవితంలో ఎంతో కీలకమైన ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను వృద్ధి చేసేందుకు ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆహార సంబంధిత రంగంలో చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ లాంటి వ్యవస్థను తెలంగాణలో నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆవిష్కరణలు చాలా ముఖ్యమని, ఇది ఆహార పరిశ్రమకే కాకుండా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతుల అభివృద్ధికి, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో భాగస్వాములు కావడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ఇన్నోవేషన్ హబ్‌గా మారేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తే రైతుల ఆర్థిక ప్రగతి మరింత వేగంగా సాధ్యమవుతుందన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన అద్భుతమైన ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగం, పాడిపరిశ్రమ, మాంసం ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, వంటనూనెల రంగం విప్లవం సృష్టించిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోని కోకాకోలా, పెప్సికో, ఐటీసీ వంటి ప్రముఖ కంపెనీలు పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధికి పది వేల ఎకరాలకు పైగా కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Also Read: 86 Push Ups In 1 Minute : 1 నిమిషంలో 86 పుషప్ లు ఎలా కొట్టాడో చూడండి .. ‘పుషప్ మ్యాన్’ వరల్డ్ రికార్డు