Site icon HashtagU Telugu

KTR : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది కాంగ్రెస్‌ పాలన : కేటీఆర్‌

ktr comments on congress govt

ktr comments on congress govt

KTR : ముఖం బాగా లేక అద్దం పగలగొట్టినట్టు, పరిపాలనలో చేతకానితనాన్ని దాచుకోలేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ..కరోనా సమయంలో రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు, ధాన్యం కొనుగోలు ఇవన్నీ నిరంతరాయంగా కొనసాగాయి. హైదరాబాద్‌ రోడ్ల పరిపూరణలోనూ పని ఆగలేదు. ఇది సమర్థవంతమైన నాయకుడు ఉన్నా ఫలితమే అన్నారు. ఆదాయం లేకున్నా అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా పరిగెత్తినట్లు గుర్తు చేశారు. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, ఈ రోజు ఆదాయం ఉంది, అద్భుతమైన రాష్ట్రం ఉంది, కేసీఆర్ వేసిన అద్భుతమైన ప్లాట్‌ఫామ్ ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదు. డబ్బులు కూడబెట్టుకొని ఢిల్లీకి మూటలు పంపాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

Read Also: Ranga reddy : ఫామ్‌హౌస్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో 40 మంది నైజీరియన్లు

తెలంగాణ రాష్ట్రాన్ని ఆదాయపరంగా, ప్రణాళికా పరంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దిన నాయకుడిని విమర్శించడం కాంగ్రెస్ నాయకులకు తలదన్నే పని అని విమర్శించారు. రాష్ట్ర ఆదాయ పరంగా దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ నాయకత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న అపనమ్మకాన్ని తొలగించి, నేడు మహిళలు గర్వంగా ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్ కిట్లు తీసుకుంటూ పండంటి శిశువులకు జన్మనిస్తున్న సంగతి ఎవరికీ తెలియదా? అని ప్రశ్నించారు. మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించి ఆరోగ్య రంగంలో దేశంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడం కేసీఆర్ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం ఏ రంగం చూసినా కేసీఆర్ పాలనలో గొప్ప పురోగతి సాధించాం.

అలాంటి నాయకుడిపై అభాండాలు వేయడం అన్యాయమని, అసత్య ప్రచారాలే తప్ప పాలనా నైపుణ్యం లేని ప్రభుత్వం చేతిలో రాష్ట్రం పతనం అవుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మహేంద్ర రచించిన కేసీఆర్ జీవిత చరిత్ర “సమగ్రంగా, హృద్యంగా ఉంది” అని ప్రశంసించారు కేటీఆర్. ఈ గ్రంథంలో కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రవేశం, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, పదేళ్ల పాలనలో సాధించిన విజయాలన్నీ ఉన్నాయి. పదేళ్లు మనం శ్రమించిన తెలంగాణ అభివృద్ధిని, పోరాటాన్ని తరం తరాలకు తెలియజెప్పేలా ప్రయత్నించాలి అన్నారు. కాళోజీ, ప్రొ. జయశంకర్, కేసీఆర్ వంటి నాయకుల జీవితాలను యువతకు స్ఫూర్తిగా నిలిచేలా పుస్తకాలు, ఆడియోలు, వీడియోల రూపంలో అందించాలి. తెలంగాణ స్ఫూర్తిని నిలబెట్టేలా చరిత్రను సజీవంగా ఉంచాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Read Also: Finisher : గౌతమ్ గంభీర్ నమ్మేది అదే !!