తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాలు ఈరోజు ఏడో రోజు కూడా వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయం ‘రైతు భరోసా’ విధి విధానాలపై స్వల్పకాలిక చర్చతో శాసనసభ ప్రారంభమైంది. శాసన సభలో అమోదం పొందిన నాలుగు బిల్లులను ఈరోజు మండలిలో సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్బంగా రుణమాఫీ (Runamafi) పై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రైతుభరోసాపై కేటీఆర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం పెడుతా అన్నారు. ఏకకాలంలో ఒకటే పెన్ స్ట్రోక్‌తో రుణమాఫీ చేస్తా అన్నారు. మరి ఆలా చేసారా..? ఏ ఊరిలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదు. కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ రాష్ట్రంలో ఏ ఊరికైనా పోదాం.. కొండారెడ్డిపల్లే, సిరిసిల్ల, పాలేరు పోదాం.. వాళ్ల ఇష్టం. ఏ ఒక్క ఊరిలో నైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని చెబితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఈ రకమైన బుకాయింపు, మోసం ప్రభుత్వానికి మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కు స్పీకర్ సూచించారు. సభానాయకుడైన రేవంత్ ను ఏకవచనంతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలని, తమకు గౌరవమిస్తే తాము కూడా గౌరవంగా మాట్లాడతామని కేటీఆర్ జవాబిచ్చారు. ‘మా నాయకుడు కేసీఆర్ను వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం కూడా అదే తరహాలో స్పందిస్తాం. నేనేం తిట్టట్లేదు కదా? పేరు పెట్టి పిలిచాను అంతే కదా?’ అంటూ వివరణ ఇచ్చారు.