Harish Rao: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగింది. చెప్పాలా గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.
ఈ ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి పై దాడి అత్యంత గర్హనీయం అని అన్నారు. ప్రజాస్వామ్యం లో హింసకు తావు లేదు. ఈ ఘటనను ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభాకర్ రెడ్డి కి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించామని, ప్రభాకర్ రెడ్డి కి కత్తిపోటు తో కడుపులో గాయాలయ్యాయని హరీశ్ రావు అన్నారు.
ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు అని, ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు అన్నారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం లో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హారీష్ రావు తెలిపారు.
Also Read: YS Sharmila: పాలేరు బరిలో షర్మిల, పొంగులేటికి సవాల్