రేవంత్ కు జై కొట్టిన వీహెచ్‌..దీక్ష‌కు కోమ‌టిరెడ్డి…ఐక్యత దిశ‌గా కాంగ్రెస్‌!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ హ‌నుమంత‌రావు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాడు. తొలి రోజుల్లో రేవంత్ నాయ‌త్వాన్ని వ్య‌తిరేకించిన ఆయ‌న ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 01:31 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ హ‌నుమంత‌రావు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సంపూర్ణ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాడు. తొలి రోజుల్లో రేవంత్ నాయ‌త్వాన్ని వ్య‌తిరేకించిన ఆయ‌న ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నాడు. అంద‌రూ రేవంత్ రెడ్డితో క‌లిసి పని చేయాల‌ని పిలుపు నివ్వ‌డం కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందిరా పార్క్ వ‌ద్ద వ‌రి ధాన్యం కొనుగోలు కోసం `రెండు రోజుల దీక్ష` వేదిక‌పై వీహెచ్ కాంగ్రెస్ ఐక్య‌త‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.
పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ భావ‌జాలం ఉన్న వాళ్ల‌ను నియ‌మించాల‌ని తొలి నుంచి వీహెచ్ కొట్లాడాడు. అధిషానంకు రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేశాడు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జ‌గ్గారెడ్డి, జానారెడ్డి త‌దితరుల‌తో క‌లిసి రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాడు. సోనియా, రాహుల్ గాంధీల‌కు నేరుగా రేవంత్ మీద ఫిర్యాదు చేయ‌డానికి బ‌దులుగా మీడియా ముఖంగా ర‌చ్చ‌కూడా చేశాడు. అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ల‌ను కాద‌ని..రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.

రేవంత్ రెడ్డి నియామ‌కంపై ఆగ్ర‌హించిన వీహెచ్ పార్టీని వీడ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ స్థాయిలో ఆయ‌న కాంగ్రెస్ అధిష్టానం మీద తొలి రోజుల్లో మండిప‌డ్డాడు. ఆ తరువాత కొన్ని రోజుల‌కు అనారోగ్యం కార‌ణంగా ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఆ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి పరామ‌ర్శ‌కు వెళ్లాడు. అప్ప‌టి నుంచి రేవంత్ మీద వీహెచ్ గ‌ళాన్ని స‌వ‌రించుకున్నాడు. అనారోగ్యం కార‌ణంగా పీసీసీ చీఫ్ హోదాలో తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి నిర్వ‌హించిన ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌లు, జంగ్ సైర‌న్ ల‌కు దూరంగా ఉన్నాడు. ఆరోగ్యం కోలుకున్న త‌రువాత రేవంత్ రెడ్డికి జై కొట్టాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక త‌రువాత రేవంత్ తో క‌లిసి కాంగ్రెస్ కోసం అంద‌రం ప‌నిచేయాల‌ని పిలుపు నిచ్చాడు.
ఇందిరాపార్క్ వేదిక‌గా కాంగ్రెస్ ఐక్య‌త పై వీహెచ్ సీరియ‌స్ గా మాట్లాడాడు. దీక్ష‌కు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో పాటు ఎవ‌రు రాక‌పోయిన‌ప్ప‌టికీ నేరుగా వాళ్ల ఇళ్ల‌కు వెళ‌తాన‌ని ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే కోమ‌టిరెడ్డి దీక్షా వేదిక పైన క‌నిపించాడు. ఇక మిగిలిన రేవంత్ రెడ్డి వ్య‌తిరేకులు కూడా ఐక్యంగా ముందు న‌డిచే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందుకు వీహెచ్ చేసిన ప్ర‌య‌త్నం దాదాపు ఫ‌లించేలా దీక్షా వేదిక ఉండ‌డం గ‌మ‌నార్హం.