KomatiReddy Venkat Reddy : నల్గొండ, భువనగిరి సీట్లపై ‘కోమటిరెడ్డి’ ఫ్యామిలీ గురి !

KomatiReddy Venkat Reddy : నల్గొండ రాజకీయాలు హీటెక్కాయి.

  • Written By:
  • Updated On - February 4, 2024 / 03:05 PM IST

KomatiReddy Venkat Reddy : నల్గొండ రాజకీయాలు హీటెక్కాయి. ప్రత్యేకించి నల్గొండ లోక్‌సభ టికెట్ కోసం అధికార కాంగ్రెస్  పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ టికెట్ కోసం తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.  నల్గొండ ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy Venkat Reddy) కూతురు శ్రీనిధి రెడ్డి కూడా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తును ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందజేసినట్లు సమాచారం.  అయితే నల్గొండ సీటు కోసం ఇప్పటికే జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అప్లై చేసుకున్నారు. ఈ ఇద్దరికి ఎవరికి కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భువనగరి సీటు కోసం కోమటిరెడ్డి సోదరులలో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

2014, 2019 ఎన్నికల్లో.. 

భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి 2014లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ, భువనగిరి .. ఈ రెండు స్థానాలు తమ ఫ్యామిలీకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు పార్టీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్యాపేట సీటును త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటును ఇస్తామని గతంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. బలమైన ఫాలోయింగ్ కలిగిన జానారెడ్డి ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీలను కాదని..  పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ లోక్‌సభ టికెట్‌ను కేటాయిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉండటం పటేల్ రమేష్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా మారొచ్చు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం  సాధించింది. నల్గొండ నుంచి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

Also Read : Worst Traffic Cities : ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో ఇండియన్ సిటీస్..

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో 2020 సంవత్సరంలో జరిగింది. ఎంపీ కోమటిరెడ్డి తన కుమార్తె శ్రీనిధిని, ఏపీలో వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేత కుమారుడు ప్రణవ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడైన ప్రణవ్‌ రెడ్డితో శ్రీనిధికి వివాహం జరిగింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్‌ వేదికగా వీరిద్దరి కల్యాణం వైభవంగా జరిగింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్, ఆ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శిల్పా మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు.