Komatireddy Venkat Reddy : సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం – మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు

  • Written By:
  • Publish Date - December 10, 2023 / 02:58 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఆదివారం పార్టీ కేటాయించిన మంత్రి బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేసారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతామని, పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే రానున్న రెండు లేదా మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని, గత పదేళ్లుగా రహదారులపై కేసీఆర్ సర్కార్ శ్రద్ధ పెట్టలేదని, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతామన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా విజయవాడ – హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు, హైదరాబాద్ – కల్వకుర్తి 4 లైన్‌లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)ని పెంచాలని అడుగుతామన్నారు. ఈ 9 దస్త్రాల్లో ఐదింటి అనుమతికి రేపు గడ్కరీని కలుస్తానని చెప్పారు. భువనగిరి ఎంపీ పదవికి కూడా రేపు రాజీనామా చేస్తానని అన్నారు. హైదరాబాద్ – విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తామని తెలిపారు.

Read Also : Free Bus Effect : యాదాద్రికి పోటెత్తిన భక్తులు