Komatireddy Rajagopal Reddy : కోమ‌టిరెడ్డి `టుడే` అప్ డేట్, బుజ్జ‌గింపులు బూమ్ రాంగ్‌!

ఇండియా టుడే స‌ర్వేతో కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ నానా అవ‌స్థ ప‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాజ్యాధికారం బీజేపీదే అంటూ తాజా స‌ర్వే వెలువ‌డింది.

  • Written By:
  • Updated On - July 30, 2022 / 11:59 AM IST

ఇండియా టివి స‌ర్వేతో కోమ‌టిరెడ్డి రాజగోపాల్‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ నానా అవ‌స్థ ప‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాజ్యాధికారం బీజేపీదే అంటూ తాజా స‌ర్వే వెలువ‌డింది. రెండో స్థానంలో టీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుంద‌ని ఆ స‌ర్వేలోని సారాంశం. ఇండియా టివి ఇచ్చిన స‌ర్వే త‌రువాత కాంగ్రెస్ పార్టీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బుజ్జ‌గించ‌డానికి మ‌రింత శ్ర‌మిస్తోంది.

రెండు రోజులుగా బీజేపీ నేత‌లు కోమ‌టిరెడ్డితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. రేపోమాపో బీజేపీలోకి చేర‌డానికి రాజ‌గోపాల్ సిద్ధం అవుతున్నారు. నియెజ‌క‌వ‌ర్గంలోని క్యాడ‌ర్ తో స‌మావేశాలు పెట్టుకున్నారు. వాళ్ల మైండ్ ను సెట్ చేసే ప‌నిలో ఉన్నారు. బీజేపీలోకి వెళ్ల‌డానికి దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఆ విష‌యం తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ బుజ్జ‌గిస్తోంది. న‌ల్గొండ జిల్లాకు చెందిన మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి బుజ్జ‌గింపు ప‌ర్వాన్ని అధిష్టానం అప్ప‌గించింది. ప్ర‌త్య‌క్షంగా రంగంలోకి దిగిన ఆయ‌న రాజ‌గోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత నిప్పులా తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి ఉంది. సీనియ‌ర్లు పైకి ఆయ‌న‌తో క‌లిసి న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఐక్య‌త మాత్రం వాస్త‌వానికి దూరంగా ఉంది. రెండు డ‌జ‌న్లుకు పైగా ఉన్న సీనియ‌ర్లు కొంద‌రు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ రేవంత్ రెడ్డితో క‌లిసి న‌డుస్తున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డి, జ‌గ్గారెడ్డి, ఉత్త‌మ్‌, జానా రెడ్డి లాంటి వాళ్లు ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. కేవ‌లం రాహుల్ ఇచ్చిన వార్నింగ్ త‌రువాత మౌనంగా ఉన్నారు. పైకి మాత్రం రేవంత్ రెడ్డికి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తున్నారు.

తాజాగా రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డానికి చేస్తోన్న ప్ర‌య‌త్నం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్లు బీజేపీ బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పైగా ఇండియా టివి స‌ర్వే వ‌చ్చిన త‌రువాత మ‌రికొంద‌రు క‌మ‌లం కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. కేవ‌లం పీసీసీ అధ్య‌క్షుడుగా రేవంత్ రెడ్డి అయిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ గంద‌ర‌గోళంగా మారింది. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన వ్య‌క్తి కింద ప‌నిచేయ‌డానికి ఏ మాత్రం కోర్ కాంగ్రెస్ టీమ్ ఇష్ట‌ప‌డ‌డంలేదు. ఇప్పుడు రాజగోపాల్ సంక్షోభం కాంగ్రెస్ పార్టీని మ‌రింత న‌ష్ట ప‌రిచే ఛాన్స్ ఉంది.

మునుగోడు ఉప ఎన్నిక‌లు వ‌స్తే గెలుపు బీజేపీ వైపు ఉంటుంద‌ని స‌ర్వే సారాంశమ‌ని బీజేపీ చెబుతోంది. అందుకే, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందుగా ఉప ఎన్నిక‌కు వెళ్ల‌డం ద్వారా ప‌బ్లిక్ మూడ్ ను సెట్ చేయ‌డానికి అనువుగా ఉంటుంద‌ని లెక్కిస్తోంది. ఇండియా టివి స‌ర్వే ఆధారంగా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌డానికి క‌మ‌ల‌నాథుల‌కు అవ‌కాశం ఏర్ప‌డింది. ఉప ఎన్నిక‌లు జ‌రిగితే, కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ప‌డుతుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. అదే జ‌రిగితే, 2023 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ముందుగానే డిసైడ్ చేసిన‌ట్టు అవుతోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముంద‌స్తుగా చేతులు ఎత్తాల్సిన దుస్థితి వ‌స్తుంది. ఢిల్లీ నుంచి తెలంగాణ వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు రంగ‌లోకి దిగిన‌ప్ప‌టికీ పీసీసీ చీఫ్ మాత్రం మౌనంగా ఉండాల్సిన దుస్థితి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏర్ప‌డింది. ఈ ప‌రిణామం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా చేస్తుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. అందుకే, ఇప్పుడు రాజ‌గోపాల్ రెడ్డిని బుజ్జ‌గించ‌డానికి కాంగ్రెస్ సీనియ‌ర్లు స‌ర్వ‌శ‌క్తులా ఒడ్డుతున్నారు. కానీ, వాళ్ల ప్ర‌య‌త్నాలు ఫ‌లించేలా క‌నిపించ‌డంలేదు. ఇండియా టివి స‌ర్వేతో తెలంగాణ రాజ‌కీయం మ‌రింత హీట్ ను పెంచింది. ఉప ఎన్నిక‌ల వైపు ప‌రిస్థితులు దారితీస్తాయా? లేదా? అనేది చూడాలి.