Site icon HashtagU Telugu

Rajagopal Reddy: బండి సంజయ్‌ని చూసి ఏడ్చేశా, రాజగోపాల్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్

Komatireddy Rajagopal Reddy Fires On Revanth Reddy 1280x720

Komatireddy Rajagopal Reddy Fires On Revanth Reddy 1280x720

Rajagopal Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన ముహూర్తంలో 2023 జూలై 21న ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్‌ని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని.. పట్టలేక బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చినట్లు రాజగోపాల్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తెలంగాణ బీజేపీ జోష్ వచ్చిందంటే.. కారణం బండి సంజయ్ మాత్రమేనని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ఆయణ్ని గుండెల్లో పెట్టుకోవాలన్నారు. మరోవైపు, తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూటకో పార్టీ మారే వ్యక్తిని తాను కాదని.. కిషన్ రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పని చేస్తానని తెలిపారు.

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. అసంతృప్తి నేతలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తప్పులు చూపడం బంద్ చేయాలని సూచించారు. కిషన్ రెడ్డిని (Kishan Reddy) స్వేచ్ఛగా పని చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు.