తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం ఇంకా సద్దుమణగడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం చర్చలో ఉండగానే, ఇప్పుడు మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో కొత్త చిచ్చు రాజేశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా (DCC President) నియమితులైన పున్నా కైలాష్ నేతను తక్షణమే పదవి నుంచి తప్పించి, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను ఆయన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేఖ ద్వారా తెలియజేయడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై పీసీసీ (PCC) చీఫ్‌తోనో లేదా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌తోనో చర్చించకుండా, నేరుగా సీఎంకు లేఖ రాయడం వెనుక కోమటిరెడ్డి వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
Lokesh US Tour : పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ యూఎస్ టూర్
పున్నా కైలాష్ నేత ఎంపిక వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఈ వివాదానికి దారితీశాయి. పున్నా కైలాష్ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా (OUJAC) కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఆయన మునుగోడు, భువనగిరి ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. చివరికి ఆయనకు నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి లభించింది. అయితే మునుగోడు ఉపఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ, పున్నా కైలాష్ నేత అప్పట్లో ఆయనపై మరియు ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ పాత వ్యాఖ్యలనే కారణంగా చూపి, తనను విమర్శించినందుకు ఆయనను పదవి నుంచి తొలగించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం అనేది ఢిల్లీలో ఏఐసీసీ (AICC) నేతృత్వంలో, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పర్యవేక్షణలో జరిగే ప్రక్రియ. రేవంత్ రెడ్డి ఒక్కరి మాటతోనే ఈ నియామకాలు జరగవు. అయినప్పటికీ, వెంకటరెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖ రాయడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. మరోవైపు, ఈ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి అనుచరులు, ఆయన ఈ నియామకాన్ని వ్యతిరేకించక పోవడంతో “కోమటిరెడ్డికి ఆ మాత్రం పవర్ లేదా?” అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అనుచరులను సంతృప్తి పరచడానికి, పార్టీలో తన పట్టును నిరూపించుకోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ గట్టిగా మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను మరోసారి బహిర్గతం చేసింది.
