Congress leader Komatireddy Venkatreddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై.. కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేశారు. అయితే.. ఇదే క్రమంలో దాడికి యత్నించిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు తిరగబడటంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే.. అంతకుముందు ఇటుకపాడు రోడ్లపై కోమటిరెడ్డి చేసిన విమర్శలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
అయితే.. బొడ్రాయి పండుగలో పాల్గొన్న కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటుకలపాడు గ్రామానికి వచ్చే రోడ్డు బాగోలేదని.. గ్రామానికి చేరుకోడానికి సుమారు 3 గంటల సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు. కేవలం కోటి రూపాయలు పెడితే రోడ్డు వేయొచ్చన్నారు. ప్రగతిభవన్, కొత్త సెక్రటేరియట్లు కట్టొచ్చు కానీ.. రోడ్డు వేయటానికి చేతులు రావట్లేదని మండిపడ్డారు. దీంతో.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంకట్ రెడ్డిపైకి కర్తలు, కుర్చీలు విసిరారు.