Site icon HashtagU Telugu

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో మ‌ళ్లీ ర‌చ్చ

komati reddy revanth

komati reddy revanth

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైయింది. వ‌రంగ‌ల్ స‌భ స‌క్సెస్ కోసం స‌న్నాహాక స‌మావేశాల‌ను రేవంత్ నిర్వ‌హిస్తున్నారు. ఆ నేప‌థ్యంలో ఈ నెల 29న నాగార్జున సాగ‌ర్ లో సమావేశాన్ని పెట్టారు. దానికి భువనగరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హాజ‌రు కావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. మే 6న వరంగల్ లో జరిగే రాహుల్ సభకు జన సమీకరణ కోసం జిల్లాల వారీగా పీసీసీ చీఫ్ సన్నాహక సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజుల క్రితం న‌ల్గొండ సన్నాహాక సమావేశం రద్దైంది. త‌న‌కు తెలియకుండానే సమావేశం నిర్వహించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, నాగార్జునసాగర్ లో శుక్ర‌వారం సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ నిర్ణ‌యం తీసుకొన్నారు. ఆ సమావేశానికి తాను హాజరు కావడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్ల‌డించారు . కేంద్ర మంత్రి నితిన్ ఖ‌డ్కారీ టూర్ కి వెళ్తున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఎవరూ నల్గొండకు రావాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించాలని సూచించారు. మాజీ మంత్రి జానారెడ్డికి అవసరం ఉందేమో అందుకే రేవంత్ రెడ్డిని పిలిపిస్తున్నారన్నారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఆయన సూచించారు. ఈ విషయమై పార్టీ అనుమతి కోసం తాను సోనియాగాంధీకి లేఖ రాస్తానని చెప్పారు. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనతో కలిసి వస్తారన్నారు. మరో వైపు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రంలో బస్సు యాత్రకు కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు.

నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి డీసీసీని ఆదేశించారు. పీసీసీ చీఫ్ రాకుండా అడ్డు పడడం సరైంది కాదని జానారెడ్డి అన్నార‌ని వినికిడి. అయితే చెప్పిన తేదీన అదే రోజు పీసీసీ చీఫ్ జిల్లాలో పర్యటిస్తారని జానారెడ్డి చెప్పారని తెలుస్తుంది. నాగార్జునసాగర్ లో సన్నాహక సమావేశానికి జానారెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. రాహుల్ సభకు జిల్లా ఇంచార్జీగా నియమించిన గీతారెడ్డిని కూడా జిల్లాకు రావొద్దని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెప్పడంతో ఆమె కూడా తన టూర్ ను రద్దు చేసుకొన్నారు.

న‌ల్గొండ జిల్లాలో జానారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి పెట్టే స‌న్నాహ‌క స‌భ‌కు సిద్ధం అయ్యారు. ఆ మేర‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఉత్త‌మ్, కోమ‌టిరెడ్డి మాత్రం దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద జానారెడ్డి రూపంలో న‌ల్గొండ రాజ‌కీయాన్ని రేవంత్ ర‌క్తిక‌ట్టిస్తున్నార‌ని అర్థం అవుతోంది.