Komatireddy Brothers: తమ్ముడి వ్యవహారంపై ‘అన్న’ మౌనం!

నల్లగొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ జిల్లా.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 11:46 AM IST

నల్లగొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ జిల్లా. ఆ స్థాయిలో జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపారు కోమటిరెడ్డి బ్రదర్స్ (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి). తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నా.. ఈ బ్రదర్స్ మాత్రం కేసీఆర్ ఎదురుగాలికి ఎదురొడ్డి నిలిచి తామెంటో నిరూపించుకున్నారు. అలాంటి బ్రదర్స్ రాజకీయంగా వీడిపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పదే పదే బీజేపీ జపం పటిస్తుండటంతో అన్న వెంకట్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కక్క లేక మింగలేక అన్నట్టుగా భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి పరిస్థితి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఇక నల్లగొండ జిల్లాపై ఆ బ్రదర్స్ పట్టుకోల్పోవడమే ఖాయమేనని అంటున్నారు ప్రత్యర్థి వర్గాలు. ఇప్పటికే నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూాపాల్ తన పట్టు నిలుపుకున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి వ్యవహరం ఆయనకు మరింత లబ్ధి చేకూరేలా ఉంది. ముఖ్యంగా మంత్రి జగదీశ్ రెడ్డికి రాజకీయంగా కలిసివచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకొని పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ట్యాగ్ కూడా ఉంది. ఓ స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే సొంత పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుండటంతో వెంకట్ రెడ్డి అనుచరులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ పడినట్టయ్యింది. పలుసార్లు రాజగోపాల్ రెడ్డి వ్యవహరంపై స్పందించాలని  వెంకట్ రెడ్డిని మీడియా కోరగా.. ‘‘ఇది ప్రజాస్వామ్యం.. ఎవరికి నచ్చినవిధంగా వాళ్లు నడుచుకుంటారు’’ అంటూ గతంలో గాంధీ భవన్ వేదికగా సమాధానమిచ్చారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి ఉంది. తమ్ముడి వ్యవహరంలో దూకుడుగా వ్యవహరిస్తారా? లేక కంపర్ట్ జోన్లో ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

పార్టీనుంచి పోతున్నా అనే వారితో ఏం మాట్లాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. V.Hanumantha Rao ఇటీవల అన్నారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలనే నిర్ణయం సరైంది కాదన్నారు.. Telangana లో TRS ను ఓడించే బలం బీజేపీకి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించే శక్తి బీజేపీకి ఉందని మా పార్టీ ఎమ్మెల్యేనే ఇలా మాట్లాడితే నేనేంమాట్లాడుతానన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతే సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.