Site icon HashtagU Telugu

MLC : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్

Kodandaram And Amir Ali Kha

Kodandaram And Amir Ali Kha

TJS అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ (Kodandaram ) శాసనమండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్ ( Amir Ali Khan ) MLCలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం దక్కగా, వారితో ఈరోజు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు మంత్రులు అభినంతనలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్‌ బుక్‌ అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోదండరాం పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని అన్నారు. అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు. అమరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని , అందరం కలిసి పని చేయడం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపామన్నారు.

ఇప్పుడున్న యంత్రాంగంలో చేరి ఎలా పని చేయాలో ఆలోచిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్సీ అనేది ఒక అవకాశం అని.. మరింత సేవ చేయడానికి దీన్ని ఉపయోగిస్తానని కోదండరాం చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. ప్రజలు అడిగిన వాటికి తాను సమాధానం చెప్తానని అన్నారు. గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ.. ఎప్పుడూ అలాగే ఉంటానని అన్నారు. ఇక తనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని వస్తున్న వార్తలపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ ప్రచారాలకు తాను సమాధానం చెప్పలేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమీర్ అలీ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా కృషి చేస్తానన్నారు.

Read Also : Mahesh Babu : ‘ముఫాస-ది లయన్ కింగ్’ కోసం మహేష్ బాబు మాట సాయం..!