Warangal Bloodshed : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కత్తుల కల్చర్ మొదలవడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలాంటి రక్తపాత ఘటనలకు సకాలంలో అడ్డుకట్ట వేయలేక ఓరుగల్లు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లాలో నడిరోడ్డుపై జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి (47) హత్యతో ఈ కత్తుల కల్చర్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే వరంగల్(Warangal Bloodshed) నగరంలో మరో మూడు ఘటనలు జరిగాయి. అవేంటో చూద్దాం..
Also Read :Indiramma Houses : ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన .. అప్లికేషన్ స్టేటస్ ఇలా తెలుసుకోండి
ఇల్లు మొత్తం రక్తపు మడుగై..
గురువారం మధ్యాహ్నం వరంగల్ పోచమ్మమైదాన్ ఎస్సీ కాలనీలో దారుణ ఘటన జరిగింది. పోచమ్మమైదాన్ ఎస్సీ కాలనీకి చెందిన జన్ను పల్లవి కేఎంసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తోంది. ఈమెకు రెండున్నరేళ్ల క్రితం వరంగల్ ఉర్సుకు చెందిన కోట చంద్రశేఖర్‌తో లవ్ మ్యారేజ్ అయింది. వీరికి ఏడాదిన్నర క్రితం కొడుకు పుట్టాడు. చంద్రశేఖర్ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుండడంతో, దీనిపై కొంత కాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పల్లవి భర్త చంద్రశేఖర్‌ను వదిలేసి, తన తల్లిగారి ఇంటికి వచ్చి ఉంటోంది. అక్కడి నుంచే జాబ్ చేయడానికి వెళ్తోంది. ఈనేపథ్యంలో గురువారం మధ్యాహ్నం చంద్రశేఖర్ నేరుగా జన్ను పల్లవి పేరెంట్స్ నివాసానికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న పల్లవి తల, ముఖంపై కత్తితో పొడిచాడు. తనను అడ్డుకోబోయిన పల్లవి తల్లిదండ్రులను కూడా కత్తితో పొడిచాడు. దీంతో ఆ ఇళ్లంతా రక్తపు మడుగుగా మారింది.
Also Read :Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా..!
డాక్టర్‌పై ఇనుప రాడ్లతో..
కాజీపేటలో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి గురువారం రాత్రి 9 కారులో భట్టుపల్లి రోడ్డు గుండా ఉర్సు వైపు వెళ్తుండగా.. అమ్మవారి పేట క్రాస్ వద్ద గుర్తు తెలియని దుండగులు అడ్డుకున్నారు. డాక్టర్ తలపై ఇనుపరాడ్లతో బాదారు. దీంతో తీవ్ర గాయాలైన డాక్టర్ సుమంత్ రెడ్డి కుప్పకూలాడు.పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
పెళ్లి వేడుకలో కత్తిపోట్లు
పెళ్లి బరాత్ అది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలో గురువారం రాత్రి ఈ వేడుక జరిగింది. ఈక్రమంలో రెండు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. నలుగురికి కత్తిపోట్లు పడ్డాయి. మడిపల్లికి చెందిన వల్లెపు కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేరు. దీంతో కనకయ్య ఆస్తిపై కన్నేసిన అతడి తమ్ముడి కుమారులే ఈ దాడి చేశారని అంటున్నారు. ఈ ఘటనలో అన్వేష్, రమేష్, ఆజయ్‌లకు కత్తిపోట్లు అయ్యాయి. కనకయ్యపై కర్రతో దాడి చేశారు. బాధితుల్లో పల్లపు రమేశ్ పరిస్థితి విషమంగా ఉంది.