Site icon HashtagU Telugu

Kishen Reddy: కేసిఆర్ సవాలుకు సిద్ధమని ప్రకటించిన కిషన్ రెడ్డి

7267kishanreddy Imresizer

వరిధాన్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కిషన్ రెడ్డి రండ కేంద్రమంత్రి అని, మొగోడైతే మోదీతో ధాన్యం కొనేలా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఉండి అబద్దాలు మాట్లాడుతున్నారని వాటిని వెంటనే వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వరిధాన్యంతో పాటు మోదీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసిరారు.

కేసీఆర్ విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తన మాటలపై తాను కట్టుబడి ఉన్నానని, దీనిపై సీఎంతో చర్చకు నేను సిద్ధమని ప్రకటించారు. అమరవీరుల స్థూపం దగ్గర ముఖ్యమంత్రితో చర్చించేందుకు రెడీ అని అయితే బూతులు మాట్లాడకుండా నాగరిక భాష మాట్లాడాలని కిషన్ రెడ్డి షరతు విదించారు.

కేసీఆర్ మాటలకు, తిట్లకు తాను భయపడే వ్యక్తిని కాదని, రైతులకు ధైర్యం ఇచ్చానే కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని మాటలైనా పడుతానని ఆయన ప్రకటించారు.

కేసీఆర్ సవాలుకు కిషన్ రెడ్డి రెడీ అయ్యారు. మరి ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.