Site icon HashtagU Telugu

Kishen Reddy: తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల పర్మిషన్ తీసుకోవాలా..? కిషన్ రెడ్డి ఫైర్..!!

Amit Shah Kishen Reddy

Amit Shah Kishen Reddy

టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అమిత్ షా పర్యటన సందర్భంగా అనేక ప్రశ్నలు సంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కిషర్ రెడ్డి మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా…ఎక్కడైనాన వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలకు చురకలంటించారు. తెలంగాణ అసెంబ్లీపై విజయ పతాకాన్ని ఎగురవేయడానికి అమిత్ షా వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా…ఇదేమైనా నిజం పరిపాలనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎంతోమంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని…హైదరాబాద్ కు ఎవరైనా రావాలంటే కల్వకుంట్ల పర్మిషన్ తీసుకోవాలా అంటూ నిలదీశారు కిషన్ రెడ్డి.

బీజేపీ, జేఏసీ, కవులు కళాకారులు లేకుండా తెలంగాణ వస్తుండేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈ రాష్ట్రంపై హక్కుఉందన్నారు. తెలంగాణపై కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎంత హక్కుందో..ఉద్యమకారులు, బీజేపీకి కూడా అంతే హక్కుందన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాల్ని బీజేపీ చైతన్యాన్ని సభ ద్వారా తెలియజెప్పాలని కిషర్ రెడ్డి అన్నారు. గడిచిన 8ఏండ్లలో ప్రతి గ్రామపంచాయతీకి కేంద్రం నిధులు ఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీనేనన్నారు. దళితుణ్ని సీఎం చేస్తామని చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ , కేసీఆర్ ను దళితులు నమ్మే స్థితిలో లేరన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఏమైందన్నారు. దళితులకు మూడెకర భూమి ఇవ్వలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తామన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారని చురకలు అంటించారు.