Telangana: బీఆర్‌ఎస్ ప్రభుత్వం హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ హోంగార్డు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి మీడియా వేదికగా సీఎం కేసీఆర్ ని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మహత్య ప్రయత్నం చాలా దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డుల హక్కులను కాలరాస్తూ వారిని అవమానిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, అయితే అది జరగలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో శాసన సభ్యునిగా ఉన్నప్పుడు నేను హోంగార్డుల హక్కుల పరిరక్షణకై పోరాడానని గుర్తు చేశారు. గార్డులకు సెలవుల విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక విధుల సమయంలో వారికి డ్రెస్ అలవెన్స్‌తో పాటు అదనపు అలవెన్సులు చెల్లించాలని కోరారు. హోంగార్డుల జీతంలోనూ జాప్యం జరుగుతుందని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. హోంగార్డుల ఆత్మహత్యాప్రయత్నాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుడికి చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రవీందర్ ప్రాణాలు కాపాడాలి అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.
సరైన పని గంటల పరిమితి లేకపోవడంతో హోంగార్డులు దయనీయమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది కొన్నిసార్లు 16-24 గంటల వరకు ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పోలీసు కానిస్టేబుళ్ల తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Life Style: నాటి పురాతన పద్ధతులు పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!