Kidney Racket : అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్న హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రి వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ ఆస్పత్రిలో నడిచిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ దీనిపై దర్యాప్తు చేస్తోంది. కిడ్నీ దాతలు, గ్రహీతలతో మాట్లాడుతోంది. ఇంకొన్ని గంటల్లో.. ఇవాళ సాయంత్రంలోగా ఈ కమిటీ తమ నివేదికను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు అందించనుంది.
Also Read :UPSC Civils 2025 : సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా అప్లై చేయండి
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారే టార్గెట్
ఆర్థిక కారణాలతో బాధపడుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని కిడ్నీల మార్పిడి రాకెట్‌ను నడిపినట్లు విచారణలో(Kidney Racket) వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ఇలాంటి నేపథ్యం కలిగిన వారిని తీసుకొచ్చి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తెలిసింది. కిడ్నీ మార్పిడి సర్జరీలను కేవలం ప్లాస్టిక్ సర్జన్ చేయాలి. అయితే అలకనంద ఆస్పత్రికి సంబంధించి ఒక ప్లాస్టిక్ సర్జన్‌కు మాత్రమే గుర్తింపు ఉంది. అయితే ఈ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి సర్జరీలను ఆయనే చేశారా ? ఆయన పేరుతో ఇంకెవరైనా చేశారా ? అనే కోణంలో ప్రస్తుతం ప్రభుత్వ కమిటీ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కిడ్నీ రాకెట్ బారినపడిన నలుగురు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు కిడ్నీ దాతలు కాగా, మరో ఇద్దరు కిడ్నీ గ్రహీతలు. ఈ నలుగురిని కూడా కమిటీ సభ్యులు కలవనున్నారు. అలకనంద ఆస్పత్రి గురించి మరింత సమాచారాన్ని వారి నుంచి రాబట్టనున్నారు. కిడ్నీల మార్పిడి పేరిట బ్రోకర్లు, వైద్యులు ఏదైనా వ్యాపారం చేశారా ? అనే కోణంలోనూ విచారణ సాగనుంది.
Also Read :AI Cancer Vaccine : ఏఐతో 48 గంటల్లోనే క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎలాగో చెప్పేసిన ఒరాకిల్ ఛైర్మన్
గత మంగళవారమే గుట్టురట్టు
గత మంగళవారం రోజు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిపై రైడ్ చేశారు.ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు. వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింది భాగంలో పెద్ద శస్త్ర చికిత్స జరిగినట్లు గుర్తించారు. దీంతో వారికి కిడ్నీ మార్పిడి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.