TCongress: టీ కాంగ్రెస్‌పై ఖర్గే ఫోకస్.. అసంతృప్తులపై ఆచీతూచీ!

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి

  • Written By:
  • Updated On - November 25, 2022 / 12:16 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి పార్టీలో ఆయనపై వ్యతిరేక వర్గం నేతలు ఏదో ఒక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేస్తూనే ఉన్నారు. పార్టీని వీడే నేతలు కూడా రేవంత్ రెడ్డి టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉన్నవారు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై బహిరంగంగా కామెంట్స్‌ చేయడమే కాకుండా.. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచి మాట్లాడిన తర్వాత.. కొద్ది రోజులు బాగానే ఉన్నట్టుగా కనిపించింది. తర్వాత మళ్లీ పాత కథే మొదలైంది.

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగిన సమయంలో నేతల మధ్య సఖ్యత ఉన్నట్టుగా కనిపించింది. కానీ రాహుల్ పాదయాత్ర తెలంగాణ దాటి వెళ్లగానే.. తిరిగి పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని పలువురు నేతలు విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్‌లకు ఇంచార్జ్‌లు ఏజెంట్లుగా మారిపోయారని విమర్శించారు.

ఈ క్రమంలోనే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మాణిక్కం ఠాగూర్‌తో పాటు, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీం జావేద్, రోహిత్ చౌదరిలు బుధవారం మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మల్లికార్జున ఖర్గే.. వారి నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ ఓటమి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు, మర్రి శశిధర్ రెడ్డి వ్యవహారం, పార్టీ నేతల మధ్య అభిప్రాయభేదాలతో పాటు.. పలు అంశాలను ఈ సందర్భంగా ఖర్గే వారితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పార్టీ నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులకు గల కారణాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. రేవంత్‌పై సీనియర్ల ఫిర్యాదులకు గల కారణాలు, పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేలా చూడాలని మాణిక్కం ఠాగూర్‌తో పాటు, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీం జావేద్, రోహిత్ చౌదరిలకు సూచించినట్టుగా సమాచారం. పార్టీలో నేతలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని వారికి మార్గనిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది.

మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వీడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. వారిని పార్టీ వీడకుండా నియంత్రించేందుకు రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని సీనియర్ నేతలు ప్రయత్నాలు చేయకపోవడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఎవరైనా అసంతృప్తితో ఉంటే వారిని గుర్తించి.. చర్చలు జరపాలని.. వారు అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకురావాలని కూడా సూచించినట్టుగా తెలిసింది.