ఎన్నికలకు కొన్ని నెలల సమయం ముందే బీఆర్ఎస్(BRS) దాదాపు అన్ని నియోజకవర్గాల పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్నుంచి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో సమస్యలు మొదలయ్యాయి. అభ్యర్థుల్ని మార్చిన చోట, కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని గొడవలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా వివాదాలు వస్తున్నాయి.
నిర్మల్(Nirmal) జిల్లా ఖానాపూర్(Khanapur) లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేఖానాయక్ (Rekha Nayak) ఉండగా ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ని ప్రకటించారు. అప్పట్నుంచి రేఖానాయక్ అసంతృప్తిగానే ఉంది. రేఖానాయక్ భర్త కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీకి కూడా దరఖాస్తు చేసుకున్నారు. జాన్సన్ నాయక్ అప్పుడే నియోజకవర్గంలో తిరుగుతూ హడావిడి చేస్తూ, రేఖానాయక్ కి ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
దీంతో నేడు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ.. నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆపేసి నన్ను అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ NTR చౌరస్తాలో ధర్నా చేస్తా. నా దగ్గర ఉన్న SB కానిస్టేబుళ్లను తీసేయడం బాధాకరం. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ ఖాతాలో పడటానికి చాలా కృషి చేశాను. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తాను. అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వేరేవాళ్ళు చెప్పుకోవడం సరికాదు. కక్షపూరితంగా అభివృద్ది పనులను ఆపేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన టైంలో గుణపాఠం చెప్తారు అని తెలిపింది.
దీంతో రేఖానాయక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చగా మారాయి. మరి దీనిపై కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి. లేదంటే ఖానాపూర్ లో బీఆర్ఎస్ గెలుపు కష్టమే.