Khammam Engineer: రూ.30తో 300 కిలోమీటర్లు .. ఖమ్మం ఇంజినీర్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు!!

ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్‌ గార్లపాటి రాకేశ్‌ ఒక వింటేజ్ మోడల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు

  • Written By:
  • Updated On - June 6, 2022 / 11:39 AM IST

ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్‌ గార్లపాటి రాకేశ్‌ ఒక వింటేజ్ మోడల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు. ఈ కారు నడుస్తుంటే కూడా చార్జింగ్‌ అవుతుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరమవుతుంది. ఈ లెక్కన 10 యూనిట్లు వినియోగమైనా రూ.30 మాత్రమే ఖర్చు అవుతుందని రాకేశ్‌ వెల్లడించారు. ఒకసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చని తెలిపారు.

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2న ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌కు కారును తీసుకురాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులు ఆసక్తిగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. వింటేజ్ మోడల్ కారును ఎలక్ట్రిక్ కారుగా రీమోడీఫై చేయడానికి దాదాపు రూ.3 లక్షలు ఖర్చయ్యాయని రాకేష్ వివరించారు. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీలను ఈ కారులో తాను అమర్చినట్లు రాకేష్ చెప్పారు.

15 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ , ప్రిస్మటిక్ లిథియం బ్యాటరీని ఈ కారులో వాడినందు వల్ల కేవలం 5 నుంచి 10 యూనిట్ల విద్యుత్ తోనే ఛార్జింగ్ పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. నార్మల్ మోడ్ లో గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో, ఎకో మోడ్ లో గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో, ఫాస్ట్ మోడ్ లో గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చని రాకేష్ చెప్పారు.

ఈ కారులోని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్(బీఎంఎస్) ను బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీలోని ఒక్కో సెల్ లో ఎంత ఛార్జింగ్ ఉంది ?ఇంకా ఎంతసేపు వస్తుంది ? అనేది ఫోన్ లోనే చూసుకోవచ్చు. బ్యాటరీలో ఏవైనా లోపాలు ఉన్నా.. ఫోన్ లో అలర్ట్ వస్తుంది. సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చే స్టార్టప్ ను ఖమ్మం కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాకేష్ వెల్లడించారు. కొంత మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో స్టార్టప్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఇంతకుముందు 2019 లోనే ఒక సాధారణ బైక్ ను ఎలక్ట్రిక్ బైక్ గా రాకేష్ మార్చాడు. బైక్ లోని డైనమో ద్వారా దాన్ని ఛార్జింగ్ చేయొచ్చు.