Srushti Hospital Case : సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా వ్యవహరిస్తున్న ఈ హాస్పిటల్‌పై మనీల్యాండరింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి కేంద్రబిందువైన డాక్టర్ అతలూరి నమ్రతపై ఇప్పటికే అనేక మోసపూరిత కార్యకలాపాల ఆరోపణలు నమోదయ్యాయి. ఆమెకు చెందిన సృష్టి హాస్పిటల్ ద్వారా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిపినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. దీంతో ఈ కేసులో Enforcement Directorate (ఈడీ) రంగ ప్రవేశించింది. ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోరారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్‌ను విస్తరించినట్లు విచారణలో తెలిసింది. మరోవైపు, దాదాపు 80 మంది శిశువులను విక్రయించి రూ. 25 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు సమాచారం.
Read Also: Rohit-Kohli: రోహిత్-కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వన్డే రిటైర్ కావచ్చు
పోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను, సృష్టి హాస్పిటల్ ఫైనాన్షియల్ లావాదేవీలను నిశితంగా పరిశీలించగా, అనేక అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ఈ దశలో మనీల్యాండరింగ్ జరగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. IVF చికిత్స పేరుతో అనేక కుటుంబాలను మోసం చేసిన ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో అధికారులకు ఇప్పటివరకూ లభించిన ఆధారాలు చూపిస్తున్నాయి. ఇంతకీ నమ్రత మీద ఆరోపణలేమిటంటే సంతానం కలగక బాధపడే దంపతుల మానసిక స్థితిని వాడుకుని, IVF చికిత్స ద్వారా బిడ్డలు పుడతారని నమ్మించి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు, బిక్షాటన చేసే వ్యక్తులు, మద్యం బానిసల నుంచి తక్కువ మొత్తం ఇచ్చి స్పెర్మ్ సేకరించి, IVF ప్రక్రియకు ఉపయోగించారని కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో మరొక షాకింగ్ అంశం వెలుగు చూసింది. డాక్టర్ నమ్రత బృందం అనేకమంది నవజాత శిశువులను కొనుగోలు చేసి, IVF ద్వారా పుట్టినవారిగా చూపించి, దంపతులకు అమ్మినట్లు ఆధారాలు లభించాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు.
విజయవాడ పోలీసులు ఇటీవల శిశువులను అమ్ముతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేయగా, ఆ గ్యాంగ్‌కు సృష్టి హాస్పిటల్‌తో సంబంధాలున్నట్లు వెల్లడి అయింది. విజయవాడలో క్రియాశీలంగా ఉన్న 3–4 గ్యాంగ్లకు ఈ హాస్పిటల్‌తో లింకులు ఉన్నట్లు పోలీసుల అనుమానం. అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన ముగ్గురు మహిళలు ఈ గ్యాంగ్‌లో ఉన్నారు. వీరు సృష్టి హాస్పిటల్ హైదరాబాద్, విజయవాడ బ్రాంచ్‌లకు పర్యటించినట్లు సీసీటీవీ ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఈ కేసులో ఐదుగురు నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, డాక్టర్ నమ్రత విచారణలో సహకరించకపోవడంతో దర్యాప్తు కఠినంగా మారింది. బయటికి వచ్చాక తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆమె చెప్పినట్లు సమాచారం, ఇది అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు, నమ్రత తరఫు లాయర్లు ఈ కేసు ఏపీలో జరిగినదని, హైదరాబాద్‌లో దర్యాప్తు జరగడం అన్యాయమని కోర్టులో పిటిషన్ వేశారు. ఇటు ఈడీ, అటు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా, ఈ కేసు ఫెర్టిలిటీ రంగంలో పనిచేస్తున్న అనేక కేంద్రాలపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇది ఒక వ్యక్తిగత మోసంగా మిగిలిపోదని, వ్యవస్థను కదిలించే మోసం అని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి