Formula E Car Race Case: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్‌లకు మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 8, 9వ తేదీల్లో తప్పకుండా విచారణకు హాజరు కావాలని బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు నిర్దేశించింది. ఈసారి తప్పకుండా విచారణకు హాజరు కావాలని సూచించింది.
Also Read :Blinkit Ambulance : బ్లింకిట్ అంబులెన్స్ సేవలు షురూ.. 10 నిమిషాల్లోనే డెలివరీ
ఇంతకుముందు వీరికి నోటీసులు జారీ చేసిన ఈడీ.. జనవరి 2న విచారణకు హాజరుకావాలని బీఎల్ఎన్ రెడ్డిని కోరింది. జనవరి 3న విచారణకు హాజరుకావాలని అరవింద్ కుమార్‌ను, జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను కోరింది. అయితే ఇవాళ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(Formula E Car Race Case) గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత టైం ఇవ్వాలని కోరుతూ ఈడీ జాయింట్ డైరెక్టరుకు ఆయన ఈమెయిల్ పంపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈడీ జాయింట్ డైరెక్టరు బీఎల్ఎన్ రెడ్డికి గడువు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఈనెల 8,9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. రేపు (శుక్రవారం రోజు) అరవింద్ కుమార్, ఈ నెల 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.