Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు – స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం, క్రీడా విధానం, రైతు భరోసా సభలపై స్పష్టత

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖకు సంబంధించి కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

హైదరాబాద్: (Telangana Cabinet) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖకు సంబంధించి కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అన్న అంశంపై స్పష్టత ఇచ్చే విధంగా, ఈ నెల 30లోగా కమిషన్‌కి పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. పీసీ ఘోష్ కమిషన్‌కు మినిట్స్‌తో కూడిన వివరాలను సమర్పించనున్నారు.

ఇక, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనుగుణంగా స్పోర్ట్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు మంగళవారం తెలంగాణవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించాలని నిర్ణయించారు.

కేబినెట్ సమావేశానికి ఇటీవల బాధ్యతలు చేపట్టిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డికి ఉజ్జయినీ మహంకాళి బోనాల ఆహ్వాన పత్రికను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగనున్నాయి.

  Last Updated: 23 Jun 2025, 10:51 PM IST