Site icon HashtagU Telugu

CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్‌లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు

Telangana Cmo Cm Revanth Team Telangana Cm

CM Revanth Team: ఏడాదిన్నర పాలనా కాలం  తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తన కార్యాలయం (సీఎంఓ)లో కీలక మార్పులు చేశారు. టీటీడీలో సుదీర్ఘ కాలం పాటు జేఈఓగా పనిచేసి ఏపీ నుంచి రిలీవ్ అయిన కేఎస్ శ్రీనివాస రాజు.. రేవంత్‌కు సన్నిహితులు. దీంతో ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా నియమించారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

Also Read :May Born People : మేలో జన్మించిన వారి వ్యక్తిత్వం, లక్షణాలివీ

జయేశ్ రంజన్‌, కె. రామకృష్ణారావు.. నాడు, నేడు కూడా.. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తోంది. అందుకే పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న జయేశ్ రంజన్‌ను సీఎంఓలోకి  తీసుకున్నారు. పరిశ్రమలు,పెట్టుబడులతో పాటు మరిన్ని కీలక బాధ్యతలను ఆయనకు కేటాయించారు. బీఆర్ఎస్ హయాంలోనూ జయేశ్ రంజన్‌ కీలక పాత్ర పోషించారు. ఆనాడు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ఈయన పేరొందారు. ఇప్పుడు సీఎం రేవంత్ మన్ననలనూ జయేశ్ రంజన్‌ పొందుతుండటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీగా నియమితులైన కె. రామకృష్ణారావు  గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈయన బీఆర్ఎస్ హయాంలోనూ కీలక పాత్రను పోషించారు. పలు ముఖ్య శాఖలను పర్యవేక్షించి ఆనాటి సీఎం కేసీఆర్ మన్ననలు పొందారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ వద్ద కూడా క్రెడిబులిటీని సాధించారు.

షానవాజ్, సత్య నారాయణ, చంద్రశేఖర్‌లకు.. 

సీఎం కార్యదర్శిగా(CM Revanth Team) వ్యవహరించిన షానవాజ్ ఖాసింకు ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ లభించింది.  సీఎం సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించిన సంగీత సత్య నారాయణను వైద్యరోగ్య శాఖ డైరెక్టర్‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా బదిలీ చేశారు. అంటే షానవాజ్ ఖాసిం,  సంగీత సత్య నారాయణలకు మంచి పోస్టింగులే లభించాయి.  సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డికి సైతం రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా పోస్టింగ్ లభించింది.

వీరు కంటిన్యూ.. 

సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న వి.శేషాద్రిని కంటిన్యూ చేస్తారని అంటున్నారు.ఆయన కీలకమైన సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, హోం, ఆర్థిక, ప్రణాళిక, న్యాయ, శాసనసభ వ్యవహారాలు, రెవె న్యూ శాఖల వ్యవహారాలతో పాటు సీఎం కార్యాలయ ఓవరాల్‌ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు.  సీఎం కార్యదర్శి కె.మాణిక్‌రాజ్‌ ఇంధన, నీటి పారుదల, విద్య, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, గనుల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు. ఐడీఈఎస్‌ అధికారి బి.అజిత్‌రెడ్డి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీఎం అపాయింట్‌ మెంట్స్‌తో పాటు సీఎంఆర్‌ఎఫ్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, కార్మిక, ప్రజాసంబంధాల శాఖల వ్యవహారాలను చూస్తున్నారు. సీఎం ఓఎస్డీ హోదాలో వేముల శ్రీనివాసులు దేవాదాయ, పర్యాటక శాఖలతోపాటు సీఎంకు వచ్చే విజ్ఞప్తులు, ప్రజావాణి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వీరందరినీ తెలంగాణ సీఎంఓలో కొనసాగించే అవకాశముంది.