Gadala Politics : ఉద్యోగానికి గడల రాజీనామా.. కాంగ్రెస్ లోక్‌సభ టికెట్‌కు అప్లై చేశానని వెల్లడి
Pasha
Gadala Srinivas
Gadala Politics : తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే జీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెంలో పలు సామాజిక సేవలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండాలని అనుకుంటున్నానని.. అందులోనూ తన మొదటి సేవ తన కులానికే చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. 25 ఏళ్ల ఉద్యోగ జీవితానికి ఇక వీడ్కోలు చెప్పానన్నారు.
ప్రజాస్వామిక వాతావరణం ఉన్న పార్టీ కేవలం కాంగ్రెసేనని గడల శ్రీనివాస్(Gadala Politics) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్‌లలో ఏదైనా ఒక చోటు నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గడల తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలో గడల.. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. భద్రాచలం నుంచి టికెట్ ఆశించగా.. అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో.. సైలెంట్ అయిపోయారు. రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చాక.. ఆయనను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన లాంగ్ లీవ్‌లో ఉన్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వద్దామని నిర్ణయించుకున్న గడల.. లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు ఈ నెల 2న దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగు సీట్ల కోసం అప్లై చేసిన కీలక నేత
కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం అందిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు.