Mother India: `భార‌త‌మాత‌`కు కేసీఆర్ కొత్త‌రూపం?

తెలంగాణ సీఎం కేసీఆర్ సంద‌ర్భానుసారంగా రాజ‌కీయాల‌ను ర‌క్తిక‌ట్టిస్తుంటారు. సెంటిమెంట్ , భావోద్వేగాల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

  • Written By:
  • Updated On - September 13, 2022 / 04:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ సంద‌ర్భానుసారంగా రాజ‌కీయాల‌ను ర‌క్తిక‌ట్టిస్తుంటారు. సెంటిమెంట్ , భావోద్వేగాల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఉద్య‌మాన్ని ఉవ్వెత్తున ఎగ‌సిప‌డేలా చేసిన సెంటిమెంట్ కు ఆనాడు తెలంగాణ త‌ల్లి రూపాన్ని జోడించారు. ఆ రూపం క‌వితకు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని ఆనాడు ప్ర‌త్య‌ర్థులు ప‌లుమార్లు విమ‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ త‌ల్లి రూపాన్ని ప్ర‌జ‌ల‌కు హ‌ద్దుకునేలా తీసుకెళ్లి సెంటిమెంట్ ను పండించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు.

జాతీయ రాజ‌కీయాల వైపు అడుగులు వేస్తోన్న కేసీఆర్ ఆనాడు చూపిన తెలంగాణ త‌ల్లి రూపాన్ని మార్చేశార‌ట‌. బ‌దులుగా భార‌త‌మాత విగ్ర‌హాలు సిద్ధం అవుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణ, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క క‌ల‌గ‌లిపిన వేష‌ధార‌ణ‌తో ఉన్న మ‌హిళ రూపాన్ని విగ్ర‌హాలుగా మ‌లిచారు. ప్ర‌త్యామ్నాయ ఎజెండాతో వ‌చ్చే జాతీయ పార్టీ ప్ర‌చారానికి ఆ విగ్ర‌హాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే, తాజాగా రూపొందించిన మ‌హిళ రూపం కూడా కేసీఆర్ ఇంటిలోని ఓ మ‌హిళ రూపాన్ని సంత‌రించుకుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తోన్న ఆరోప‌ణ‌. కుమార్తె క‌విత రూపాన్ని తెలంగాణ త‌ల్లికి అద్దార‌ని ఆనాడు కేసీఆర్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయ‌న ఇంటిలోని మ‌రో మ‌హిళ రూపం అంటూ కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది. అంతేకాదు, యాదాద్రి దేవాల‌యంలోనూ కేసీఆర్ రూపం ఉండే విగ్ర‌హాలను చెక్కార‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

సెంటిమెంట్ ను బాగా న‌మ్ముకున్న కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోనూ అదే సెంటిమెంట్ తో దూకుడుగా వెళ్లాల‌ని చూస్తున్నారు. అందుకే, ద‌క్షిణ భార‌త దేశం ట్యాగ్ ను తీసుకోనున్నారు. సుదీర్ఘంగా ఉన్న ఉత్త‌ర, ద‌క్షిణ ప్రాంతాల మ‌ధ్య ఉన్న గ్యాప్ ను సెంటిమెంట్ రూపంలోకి తీసుకురాబోతున్నార‌ట‌. అందుకు త‌గిన విధంగా విగ్ర‌హాలు, సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు సంబంధించిన అంశాల‌ను క్రోడీక‌రిస్తున్నారని తెలుస్తోంది. వాటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డం ద్వారా తెలంగాణ త‌ర‌హాలో దేశ రాజ‌ధాని పీఠాన్ని జ‌యించాల‌ని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు.

ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం కేసీఆర్ వేసిన సెంటిమెంట్ పునాదుల‌ను క‌దిలించాల‌ని తెలంగాణ నుంచే ప్రారంభించారు. ఆ దిశ‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ప‌రిచ‌యం చేసిన ప‌లు అంశాల‌ను మార్చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. సెప్టెంబర్ 17 నుండి సరికొత్త తెలంగాణ ఆవిష్కరణ ఉంటుంద‌ని రేవంత్ చెబుతున్నారు.
ప్ర‌స్తుతం వాహనాల కోడ్ టీఎస్ ను టీజీగా మార్చేస్తామ‌ని వెల్ల‌డించారు. అందెశ్రీ రాసిన జయజయహే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామ‌ని హామీ ఇచ్చారు. దొరల తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామ‌ని చెప్పారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రత్యేక జెండాను ఎగురవేస్తమ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాస్తవ చరిత్ర ప్రజలకు తెలిసేలా సమూల మార్పులు తీసుకొస్తామ‌ని రేవంత్ వెల్ల‌డించారు. అంటే, కేసీఆర్ సెంటిమెంట్ పునాదుల‌తో నిర్మించిన గులాబీ సామ్రాజ్యాన్ని కూల్చేయ‌డానికి రంగం సిద్ధం అవుతోంద‌న్న‌మాట‌.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిచ‌యం చేసిన తెలంగాణ త‌ల్లి రూపురేఖ‌ల్ని మార్చేలా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సెంటిమెంట్ దేశ వ్యాప్తంగా ఫ‌లించ‌డం క‌ష్ట‌మే. తెలంగాణ తల్లి సెంటిమెంట్ తో రెండు సార్లు సీఎం అయ్యారు. మూడోసారి సీఎం కావ‌డానికి తెలంగాణ త‌ల్లి కి బ‌దులుగా భార‌తమాత‌ను ఆయ‌న న‌మ్ముకోవ‌డం గ‌మ‌నార్హం.