తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త సెక్రటేరియట్ (Secretariat) లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంత్రులు తమ తమ ఛాంబర్లలోకి అడుగుపెట్టి పలు పైళ్లపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు వస్తారా? లేక ప్రగతి భవన్ కే పరిమితమవుతారా? అని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (CM KCR) సోమవారం కొత్త సచివాలయంలో తన మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కీలక విషయాలపై చర్చ
సచివాలయం లో మొదటి రోజు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలు తీరు పై, తాగునీటి కోసం చేపట్టిన పనుల పురోగతి పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్ వరకు వెళ్లే తాగునీటి కాల్వలపై కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చెఫ్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
రెగ్యులర్ గా వస్తారా?
గత తొమ్మిదేళ్లలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఇప్పుడైనా వస్తారని తాను భావిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోను హైదరాబాద్ రాజధానిగా ఉందని, అప్పుడు ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సరిపడా సచివాలయం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నాడు గొప్పగా సచివాలయం ఉండేదని, కానీ, ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాడని చెప్పారు. సచివాలయాన్ని కట్టడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఆయన ప్రతిష్ఠ కోసం, ఆయన పేరు కోసం దీనిని కట్టినట్లుగా భావిస్తున్నానని చెప్పారు.
Also Read: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్