Federal Front: ప్రాంతీయ పార్టీల చేతులు కలుస్తున్నాయి.. మరి అవి హస్తంతో కలవగలవా?

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయాల ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల మేర ఉందో మొద‌ట ప‌రీక్ష చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 21, 2022 / 07:46 AM IST

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాజ‌కీయాల ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల మేర ఉందో మొద‌ట ప‌రీక్ష చేస్తున్నారు. దేశంలో బ‌ల‌మైన రాజ‌కీయ ఫ్రంట్ ఉండాల‌న్న దాంతో ఎవ‌రికీ విభేదాలు లేవు. దాని స్వరూపం, విధివిధానాల‌పైనే నాయ‌కులు చ‌ర్చలన్నీ. ముంబ‌యి వెళ్లి మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌లతో జ‌రిపిన చ‌ర్చల్లో ఫ్రంట్ ఏర్పాటుకు ఏ వ్యూహాన్ని అనుస‌రించాల‌నేదానిపై దృష్టి పెట్టారు.

వ్యక్తుల‌ను కాకుండా, స‌మ‌స్యల‌ను టార్గెట్ చేసుకొని ఫ్రంట్ ను ఏర్పాటు చేయాల‌న్న అంగీకారానికి వ‌చ్చారు. స‌మ‌స్యల విషయానికి వ‌స్తే తెలంగాణ‌లో కేసీఆర్ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు స‌త్ఫలితాలు ఇస్తున్నందున వాటిని జాతీయ స్థాయి అంశాలుగా మార్చి ప్రత్యామ్నాయ ప్రణాళిక‌గా తీర్చిదిద్దే అవ‌కాశం ఉంది. ఇది త‌న‌కు ప్లస్ పాయింట్ అని ఆయ‌న భావిస్తున్నారు.

దేశ రాజ‌కీయాల‌ను చూస్తే కాంగ్రెస్‌తో ఎలా వ్యవ‌హ‌రించాల‌న్నది పెద్ద స‌మ‌స్యగా మారింది. నాయ‌క‌త్వ లోపం ఆ పార్టీని వేధిస్తోంది. రాజ‌కీయంగా ఆ పార్టీ ప్రభావం చూప‌డం లేద‌న్నది కేసీఆర్ భావ‌న‌. తెలంగాణ‌లో అయితే ఆ పార్టీతో యుద్ధమే చేస్తున్నారు. ప్రధాన ప్రతిప‌క్షంగా భావించి పోరాటం చేస్తున్నారు. ధాకరే, ప‌వార్‌ల ప‌రిస్థితి వేరు. వారు కాంగ్రెస్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు.

ప్రంట్‌లో కాంగ్రెస్ ఉండాల‌న్న‌దే వారి అభిమ‌తం. అందువ‌ల్ల కాంగ్రెస్ తో క‌లిసి ఉండే ఫ్రంటా? లేని ఫ్రంటా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీని మాట ఎలా ఉన్నా కేసీఆర్ మాత్రం ప్రయ‌త్నాల‌ను ఆపేలా లేరు. అందులో భాగంగా మాజీ ప్రధాని దేవెగౌడ‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ల‌తో భేటీ కానున్నారు. వారిద్దరికీ స‌న్నిహితుడైన ప్రముఖ సినీన‌టుడు ప్రకాశ్ రాజ్‌ను త‌న‌తో తీసుకెళ్లనుండ‌డం విశేషం. అయితే ఈ రాజకీయ చదరంగంలో ప్రకాశ్ రాజ్ కు కేసీఆర్ ప్రాధాన్యతను ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.