Apex Council : కేసీఆర్ అబ‌ద్ధాల‌పై కేంద్రం ఫోక‌స్

తెలంగాణ ముఖ్య‌మంత్రి మాట‌ల్లోనూ, చేత‌ల్లోనూ తేడా కనిపిస్తోంది. ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు స‌హ‌జంగా కేసీఆర్ ఆ విధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌డ‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటారు.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 04:31 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి మాట‌ల్లోనూ, చేత‌ల్లోనూ తేడా కనిపిస్తోంది. ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు స‌హ‌జంగా కేసీఆర్ ఆ విధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌డ‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటారు. కాలు కాలిన పిల్లి మాదిరిగా ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డానికి కార‌ణంగా కేంద్ర వాల‌క‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాల టాక్‌. మూకుమ్మ‌డిగా కేంద్ర మంత్రులు మీడియా ముందుకొచ్చి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడా నికి పూనుకున్నారు. ఆ క్ర‌మంలోనే తొలుత కేంద్ర జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ ష‌కావ‌త్ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడాడు. కృష్ణా జ‌లాల మీద కేసీఆర్ ఆడిన నాట‌కాన్ని పూస‌గుచ్చిన‌ట్టు చెప్పాడు.
హుజూరాబాద్ ఓట‌మి త‌రువాత కేసీఆర్ కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నాడు. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌ను లక్ష్యంగా చేసుకుని రాజ‌కీయ దాడికి శ్రీకారం చుట్టాడు. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ఎందుకు సాధించలేక‌పోతున్నార‌ని బీజేపీ నేత‌ల‌ను నిల‌దీస్తున్నాడు. కాళేశ్వ‌రం జాతీయ ప్రాజెక్టుగా తీసుకురాల‌ని దద్ద‌మ్మ‌లు అంటూ మెడ‌లు ముక్క‌లు చేస్తానంటూ హూంక‌రించాడు. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను చాక‌చ‌క్యంగా కేంద్రంపైన కేసీఆర్ నెట్టేస్తున్నాడు. పేద‌ల‌కు కేంద్రం ఇచ్చే ప‌థ‌కాల‌ను త‌మ సొంతంగా డ‌ప్పాగొట్టుకుంటున్నాడు. ఇదే విష‌యాన్ని కేంద్రంలోని పెద్ద‌ల‌కు బీజేపీ తెలంగాణ చీఫ్ పూస‌గుచ్చిన‌ట్టు రాత‌పూర్వ‌కంగా అందించాడ‌ట‌. అందుకే, రాష్ట్ర నేత‌ల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు.

Also Read : ADR report: టాప్ 3 `బ్లాక్ మ‌నీ` పార్టీలు మ‌న‌వే!

కృష్ణా న‌ది నీటి వాటాల‌పై కొత్త ట్రైబ్యున‌ల్ వేయాల‌ని కేంద్రాన్ని కోరిన విష‌యాన్ని ష‌కావ‌త్ వివ‌రించాడు. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను విశ‌దీక‌రించాడు. ట్రైబ్యున‌ల్ ను కోరిన కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేశాడు. ఆ కార‌ణంగా కేంద్రం ఏమీ చేయ‌లేక‌పోయింది. ట్రైబ్యున‌ల్ వేయాలంటే సుప్రీం కోర్టు నుంచి పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేసీఆర్ కు కేంద్రం సూచించింది. ఏడేళ్ల నుంచి ఆ పిటిష‌న్ ను పెండింగ్ లో పెట్టిన కేసీఆర్ రెండు నెల‌ల క్రితం పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకున్నాడు. ట్రైబ్యున‌ల్ వేసే ప్ర‌క్రియ ఇప్పుడు కేంద్రంలో కొన‌సాగుతోందనే విష‌యాన్ని ష‌కావ‌త్ వివ‌రించాడు. వాస్త‌వాలు ఇలా ఉంటే , కేంద్రాన్ని ఎందుకు కేసీఆర్ త‌ప్పు బ‌డుతున్నార‌ని నిల‌దీశాడు.
తెలంగాణ రాష్ట్రంలో వ‌రి పంట‌ను కొనుగోలు చేయ‌డానికి కేంద్ర అనుమ‌తులు ఉన్నాయ‌ని తెలియ‌చేస్తూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మీడియాముఖంగా చెప్పాడు. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను కూడా చూపాడు. కేవ‌లం బాయిల్డ్ రైస్ ను మాత్ర‌మే కేంద్రం కొనుగోలు చేయ‌డానికి నిరాక‌రించింద‌ని తెలిపాడు. వ‌రి ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌లేద‌ని, కేసీఆర్ ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌ప్పుదోవ ప‌ట్టించేలా మాట్లాడుతున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టాడు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించ‌కుండా పరిపాల‌న చేయాల‌ని హిత‌వు ప‌లికాడు.

Also Read : Dharna Chowk: ధర్నా చౌక్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ నేతలు

సునాయాసంగా అబద్దాలు చెప్ప‌డం, ఆడిన మాట త‌ప్ప‌డం..కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌గా ప్ర‌త్య‌ర్థులు చెబుతుంటారు. ద‌ళితుడ్ని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని హామీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి రైతు రుణ మాఫీ, ద‌ళితుల‌కు మూడెక‌రాలు భూమి, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, ద‌ళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల క‌ల్ప‌న‌, డీఎస్సీ నోటిఫికేష‌న్‌..ఇలా అనే హామీలు, ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలోని అంశాల‌ను నెర‌వేర్చ‌డంలో కేసీఆర్ వైఫ‌ల్యం చెందాడు. అందుకే , కేసీఆర్ అన్నీ అబద్దాలు చెబుతాడ‌ని ప్ర‌త్య‌ర్థులు చేసిన ప్ర‌చారాన్ని చాలా వ‌ర‌కు ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. ఫ‌లితంగా వేల కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ప్ప‌టికీ హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది.
కేసీఆర్ అబ‌ద్దాల‌ను న‌మ్మొద్ద‌ని చెప్ప‌డానికి ఇప్పుడు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. రాబోవు రోజుల్లో వ్య‌వ‌సాయ, వైద్య ఆరోగ్య‌, ఆర్థిక , ర‌క్ష‌ణ శాఖ‌ల మంత్రులు కూడా కేసీఆర్ ను ఢిల్లీ నుంచి టార్గెట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నార‌ట‌. ఇదంతా చూస్తుంటే, తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి అగాధం ఏర్ప‌డిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఆ మ‌ధ్య ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ నెల రోజుల పాటు అక్క‌డ ఏం చేశారు? వారం రోజుల పాటు హ‌స్తిన‌లో ఉన్న‌ప్పుడు ఏమైయింది? అనే ర‌హ‌స్యాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదే దూకుడును టీఆర్ఎస్, బీజేపీ కొన‌సాగిస్తే స‌మీప భ‌విష్య‌తులో తెలంగాణ రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు క‌నిపించే అవ‌కాశాలు లేక‌పోలేదు.