KCR : కేసీఆర్ నోట ఓటమి మాట.. వ్యూహమా.. నిజమా?

తాను ఓడిపోతే తనకు నష్టం ఏమీ లేదని, హాయిగా విశ్రాంతి తీసుకుంటానని, నష్టపోయేది ప్రజలేనని కేసీఆర్ (KCR) అంటున్నారు.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 04:16 PM IST

By: డా. ప్రసాదమూర్తి

KCR words… Strategy or Truth : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తన ప్రధాన ప్రత్యర్థి అని తేలిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై ద్విముఖ దాడిని ప్రారంభించారు. ఒకటి తాను పది సంవత్సరాలు పరిపాలించానని, ఓడిపోతే తనకు నష్టం ఏమీ లేదని, హాయిగా విశ్రాంతి తీసుకుంటానని, నష్టపోయేది ప్రజలేనని కేసీఆర్ (KCR) అంటున్నారు. ఈ మాటను ప్రతిపక్షాలు ఆయుధంగా తీసుకొని కేసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన ఇలా అంటున్నారని ప్రచారం చేయడం ప్రారంభించాయి. కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, ఓటమి అంటూ ఎదురైతే ఎవరైనా స్వీకరించాల్సిందే అని అన్నారు. ఈ మాటలన్నీ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడో అపజయం భయం ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అన్న మాటని కొందరు విశ్లేషిస్తున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

కేసిఆర్ తాను ఓడిపోతే నష్టపోయేది ప్రజలేనని చెప్పడంతో ఆగిపోలేదు. ప్రతి సభలోనూ పదేపదే కాంగ్రెస్ పై ఒకే రకమైన విమర్శనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అది ఏమిటంటే తాను ఓడిపోతే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతకుముందు తాము ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆగిపోతాయని కేసీఆర్ (KCR) ప్రజలను హెచ్చరిస్తున్నారు. రైతుబంధు, దళిత బంధు మొదలైన పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుందని, తాము భూముల అమ్మకాల కొనుగోలు విషయంలో పారదర్శకత తీసుకువచ్చిన ధరణి ల్యాండ్ వెబ్ పోర్టల్ ను కూడా కాంగ్రెస్ రద్దుచేసి తిరిగి పాతకాలపు దళారీ వ్యవస్థను పునరుద్ధరిస్తుందని, దీనితో తెలంగాణ ప్రజలు మళ్లీ చీకటి రోజులు చూడాల్సి వస్తుందని కేసిఆర్ పదేపదే హెచ్చరిస్తున్నారు. అంతేకాదు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ ఎంతో వెనుకబడిపోయిందని, ఈ వెనుకబాటు తనానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని కేసిఆర్ దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో లక్షలాదిమంది ప్రజలు పనిపాట్ల కోసం వలస పోయే వారని, ఇప్పుడు తాము ఇరిగేషన్ ప్రాజెక్టులతో, మంచినీటి సదుపాయాలతో తెలంగాణను సస్యశ్యామలం చేశామని, ఇదంతా కాంగ్రెస్ వస్తే తిరిగి సర్వనాశనం అయిపోతుందని కేసీఆర్ ఉవాచ.

అందుకే కేసిఆర్ తాను ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని, నష్టపోయేది ప్రజలేనని ఆయన చెప్పడంలో చాలా వ్యూహం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ (KCR) వ్యూహంలో ప్రజలను ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయడం కూడా ఉందని కొందరు భావిస్తున్నారు. తాము ఈ పదేళ్లలో సాధించిన ప్రగతి మొత్తం కాంగ్రెస్ అధికారం చేపడితే తుడిచిపెట్టుకుపోతుందని తనకేమీ నష్టం లేదని కేసిఆర్ ప్రజలను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూసేవారని ఇప్పుడు తాము 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని కేసిఆర్ చెప్పడం వెనక కూడా ఈ వ్యూహమే ఉంది. కాంగ్రెస్ బహిరంగంగానే రైతులకు మూడు గంటలు కరెంటు సరఫరా సరిపోతుందని అంటున్న మాట కేసీఆర్ పదేపదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. రైతులు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి రైతుబంధు పథకం, వారి పంటకు భరోసా కోసం రైతు బీమా పథకం, ఇంటింటికి, మారుమూల తండాలకు కూడా తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం, అలాగే దళితులు ఆత్మగౌరవంతో బతకడానికి దళిత బంధు పథకం ఇలా ఎన్నో పథకాలను తాము అమలు చేశామని, ఇవి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గాలిలోకి కొట్టుకుపోతాయని కేసీఆర్ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇది హెచ్చరికా.. లేక ప్రజలను బెదిరించడమా అనే చర్చ కూడా కొంత మేధావి వర్గాల్లో సాగుతోంది.

ఒకపక్క కాంగ్రెస్ పార్టీ తాము చేసిన హామీలను కర్ణాటకలో అమలు చేస్తున్నామని, చూడాలంటే ఎవరైనా తమ రాష్ట్రం రావచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బహిరంగంగానే తెలంగాణ పాలకులకు ఒక సవాలు విసిరారు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఏ పథకాన్నీ కర్ణాటకలో అమలు చేయడం లేదని, కర్ణాటక ప్రజలందరూ ఇప్పుడు పశ్చాత్తాపంతో బాధపడుతున్నారని ప్రచారం సాగిస్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా, ఎన్నికల సమయంలో నాయకుల మాటలు మొత్తం ఒక పక్కా వ్యూహంగానే సాగుతాయి. సామాన్య ప్రజలు ఏది నిజం ఏది అబద్దం తేల్చుకునే విషయంలో చాలా చాలా గందరగోళాన్ని ఎదుర్కొంటారు. మొత్తానికి కేసీఆర్ నోట ఓటమి మాట వినపడడం ఆయన వ్యూహాత్మకంగా అంటున్నదేనని కొందరి విశ్లేషణ. కానీ నిజంగానే బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకున్నదేమో అని కొందరి సందేహం. ఏది వ్యూహం.. ఏది నిజం తేలడానికి ఇంకా ఎంతో సమయం లేదు. రెండు వారాల్లో అన్నీ తేలిపోతాయి. జస్ట్ వేచి చూద్దాం అంతే.

Also Read:  Revanth Reddy Open Challenge to KCR : కరెంటుపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు రేవంత్ ఛాలెంజ్..