Yadadri temple: ఆలయ ప్రారంభోత్సవం.. చిన జీయర్ స్వామి, మోదీల‌కు కేసీఆర్ ఝ‌ల‌క్..!

  • Written By:
  • Publish Date - February 27, 2022 / 04:40 PM IST

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2014 నుంచి సీఎం హోదాలో దాదాపు 18 సార్లు యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఇప్పటివరకు ఆలయ పునరుద్ధరణ పనులకు 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక మార్చి 28న యాదాద్రి ఆలయ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి చాలా త‌క్కువ మంది ప్ర‌ముఖుల‌ను కేసీఆర్ ఆహ్వానించునున్నారి స‌మాచారం.

ఈ నేప‌ధ్యంలో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా మార్చి 21 నుండి వారోత్సవాలను నిర్వహించాలని అనుకున్నారు కేసీఆర్. అయితే మార్చి 21 నాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కుదరదని గుర్తించి మహా సుదర్శన యాగాన్ని కేసీర్ విరమించుకున్నట్లు అక్క‌డి అధికారులు చెబుతున్నారు. అయితే ఉగాది తర్వాత మహా సుదర్శన యాగం నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నార‌ని స‌మాచారం.

గోపురాలకు కలశముల‌ను బిగించడంతోపాటు పలు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉనాయ‌ని, దీంతో మార్చి 28 ప్రారంభోత్సవం తర్వాత పునరుద్ధరించిన ఆలయ ప్రాంగణంలోకి, భ‌క్తులను అనుమతించడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో యాదాద్రి ఆల‌య‌ ప్రారంభోత్సవం తర్వాత భక్తులు మరో ఒకటి లేదా రెండు వారాలు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కలశములను సరిచేయడానికి కర్రల సపోర్టుతో స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ క్ర‌మంలో యాత్రికులు వ‌స్తూ పోతూ ఉంటే ప‌ని చేసే వారికి ఆటంకం క‌ల్గుతుంద‌ని, దీంతో పనులు మందగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

యాదాద్రి పునఃప్రారంభం కోసం చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో 1,048 యాగ మండపాలు, 4,000 మంది ఋత్విక్కులు మొదలైన వాటితో మహా సుదర్శన యాగం నిర్వహించడం గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. అయితే మార్చి 21 సమీపిస్తున్న తరుణంలో హఠాత్తుగా యాదాద్రి ప్రారంభోత్సవంపై కేసీఆర్ సైలెంట్ అయ్యారు. అలాగే ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్‌లను ఆహ్వానించాలని చంద్రశేఖర్‌రావు ప్లాన్ చేశారు.ఆలయ పునరుద్ధరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని గతంలో సీఎం కేసీఆర్ వెల్ల‌డింయాకె, ఈ క్ర‌మంలో గత ఏడాది సెప్టెంబర్ 3న ప్రధాని మోదీకి కేసీఆర్ ఆహ్వానం కూడా పంపారు.

అయితే ప్ర‌స్తుతం బీజేపీతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేసీఆర్ త‌న ప్లాన్‌ను మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌ధ్‌యంలో రాష్ట్రపతిని, ప్రధానిని, ఎవరినీ ఆహ్వానించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్‌కు యాదాద్రిలో హంగామా అక్కర్లేదని, కేసీఆర్ మాత్రమే హాజరై ఆలయ ప్రారంభోత్సవం చేస్తారట. మహా సుదర్శన యాగం కూడా కేసీఆర్ వాయిదా వేసినట్లు సమాచారం. ప్ర‌స్తుతం బీజేపీతోనూ, మోదీతోనూ కేసీఆర్ ప్రత్యక్ష పోరు సిద్ధమైన సంగ‌తి తెలిసిందే .. దీంతో ఎవరిని ఆహ్వానించ కూడదని కెసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్ర‌ధాని మోదీ, జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించడం సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మోదీని రాముడు అని కీర్తించడంతో, కేసీఆర్‌కు చినజీయర్ స్వామికి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ అంశాలన్నీ యాదాద్రి ఆలయ మహా ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ప్రభావం చూపనున్నాయని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.