కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేపు (ఈనెల 17న) మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలను తెలంగాణ భవన్ లో నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ (Brs Key Meeting)లో పార్టీ ఎంపీలు, ఎమ్మెలేలు అందరూ పాల్గొననున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈసందర్భంగా నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున.. ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మూడో దఫా అధికారంలోకి వచ్చేటందుకు..
తెలంగాణలో మూడో దఫా అధికారంలోకి వచ్చేటందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏమేం చేయాలనే దానిపైనా డిస్కస్ చేయనున్నారు. ఈ దఫా బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ప్రయత్నాలను ఎలా కౌంటర్ చేయాలనే దానిపైనా ఈ మీటింగ్ (Brs Key Meeting)లో వ్యూహాన్ని సిద్ధం చేస్తారని అంటున్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపైనా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖ వివిధ సంక్షేమ పథకాలపై ప్రచార సామగ్రి, డాక్యుమెంటరీలను సిద్ధం చేస్తోంది. మరోవైపు దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.