జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రచారం లో రేవంత్‌పై విమర్శిస్తూ.. “సీఎం గారూ, కాలికి బలపం కట్టుకుని జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతున్నారు” అని వ్యాఖ్యానించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ .. “పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకే ప్రజల మధ్యకి వచ్చి ప్రచారం చేస్తున్నాను. ముఖ్యమంత్రిగా కాకుండా, కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇక్కడ ఉన్నాను” అన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఇది నా కర్తవ్యం ఎవరినైనా విమర్శించడానికి కాదు, ప్రజాసేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను” అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా మాట్లాడుతూ “ఇది మొదటి సారి కాదు, ఇతర నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను మరింతగా ప్రచారం చేశాను” అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ, పార్టీ అభ్యర్థి విజయమే ప్రధాన లక్ష్యమని రేవంత్ వ్యాఖ్యానించారు. “ప్రజలతో నేరుగా కలవడం, వారి అభిప్రాయాలను వినడం ఇవే నా రాజకీయ శైలి. కేటీఆర్, కేసీఆర్ వంటి వారు లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ప్రజలను దూరం నుంచి చూసే వారు కాదు నేను” అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో ఉపఎన్నిక ప్రచారం వేడిగా మారింది.
అదే సమయంలో రేవంత్ కేసీఆర్‌పై కూడా రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “జూబ్లీహిల్స్‌లో గెలుపుపై కేసీఆర్‌కు నమ్మకం ఉంటే, కనీసం సునీతను గెలిపించమని ఒక ప్రకటనైనా ఇచ్చేవారు,” అని కౌంటర్ వేశారు. “కానీ ఆయన మౌనం బీఆర్ఎస్‌లో ఉన్న గందరగోళాన్ని బయటపెడుతోంది. పార్టీ కార్యకర్తలకే ఇప్పుడు మార్గదర్శకత్వం లేకుండా పోయింది,” అన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నెలకొనగా, బీఆర్ఎస్ నేతలు ఆయన మాటలను రాజకీయ నాటకం అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, ప్రతివిమర్శలతో తారస్థాయికి చేరుకుంది.
