Site icon HashtagU Telugu

KCR New Strategy : వ్యూహం మార్చిన కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు చెక్

Kcr Who Has Changed His Strategy Is A Check For Bjp And Congress

Kcr Who Has Changed His Strategy Is A Check For Bjp And Congress

By: డా. ప్రసాదమూర్తి

KCR changed his Strategy :  తెలంగాణలో బ్యాటిల్ లైన్స్ క్లియరయ్యాయి. ఎవరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలు విన్నారు. ఎన్నికల వాగ్దానాలు ఎన్నికలకే పరిమితమా.. లేక నాయకుల చిత్తశుద్ధికి అవి ప్రమాణం అవుతాయా అనే మాట కాలం నిరూపించాల్సిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎన్నికల పథకాలు, వాగ్దానాల యుద్ధం సాగింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా తాము ప్రకటించిన పథకాలను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఒక పక్కన అంటుంటే, మరోపక్క కాంగ్రెస్ వారి మేనిఫెస్టో ఒక టిష్యూ పేపరంత విలువ కూడా చేయదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసి పాడేశారు. ఎన్నికల ప్రణాళికల యుద్ధం ఇలా సాగుతుంటే, ఈ యుద్ధాన్ని తెలివిగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మరో మలుపు తిప్పారు. “పథకాలు కాదు మా పనితీరు చూసి ఓటు వేయండి” అని ఆయన నేరుగా ప్రజల్ని అడుగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటిదాకా పథకాల మీద చాలా కసరత్తు చేసి, కాంగ్రెస్ వారి పథకాల కంటే మెరుగైన మేలైన పథకాలను తామే ప్రవేశపెడతామని మేనిఫెస్టో తయారుచేసి, అత్యంత ఆడంబరంగా ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన KCR, ఇప్పుడు తమ ఎన్నికల వాగ్దానాలు, పథకాలు మాట పక్కన పెట్టి, తాను చేసిన పని గురించి మాట్లాడుతున్నారు. దీన్నిబట్టి కేసిఆర్ తన ఎన్నికల వ్యూహాన్ని మార్చి విపక్షాల నాయకులకు గట్టి సవాలే విసిరినట్లు కనిపిస్తోంది. రాజకీయాలలో కేసీఆర్ గండరగండడు. ఏ క్షణంలో ఆయన ఏ ఎత్తు వేస్తాడో ప్రత్యర్థులకు ఊహకు కూడా అందదు.

సోమవారం నాడు జనగాంలో, బోనగిరిలో జరిగిన బహిరంగ సభల్లో KCR చేసిన ప్రసంగం అతి కీలకమైందిగా భావించాలి. సాధారణంగా ఎన్నికల ముందు తాము ప్రవేశపెట్టిన పథకాలను, ఇక ముందు తీసుకురాబోయే పథకాలను గురించి నాయకులు ప్రచారం చేసుకుంటారు. ఈ పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగైన స్థానంలో ముందున్నట్టుగా కనిపిస్తోంది. కర్ణాటకలో విజయం తర్వాత, ఆ విజయానికి కారణం కాంగ్రెస్ పార్టీ పథకాలేనన్న ప్రచారం దేశమంతా ఊపందుకున్న తర్వాత, ఆ మ్యాజిక్ తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని కాంగ్రెస్ సాగిస్తున్న సాముగరిడీలు చూసి, కేసీఆర్ తను వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న పథకాల మాయలో పడి, తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని కేసీఆర్ (KCR) గమనించినట్టుంది. అందుకే నిన్న జరిగిన సభల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ వ్యవస్థను బంగాళాఖాతంలో విసిరేస్తుందని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టం. దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, జరుగుతోందని, లక్షల కోట్లు చేతులు మారుతున్నాయని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. దీన్ని కేసిఆర్ సీరియస్ గా తీసుకోవడం మాత్రమే కాదు తెలివిగా తిప్పి కొడుతున్నారు.

Also Read:  KCR Campaign: కాంగ్రెస్ గ్యారెంటీ హామీలకు కేసీఆర్ ప్రచారం..?

ఎప్పుడో పాతకాలం నాటి గ్రామీణ రెవెన్యూ అధికారి చూపించే పాతపద్దుల దస్తావేజుల రోజుల్లోకి ప్రజలను తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, వ్యవసాయ రంగాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించే ధరణి, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో విధానాలను తాము ప్రవేశపెట్టామని వాటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ గాల్లోకి విసిరేస్తుందని, రైతులకు కేవలం మూడు గంటల కరెంటు సరఫరా ఉంటే చాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని కూడా కేసీఆర్ తిప్పి కొట్టారు.

సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేసి సుస్థిరమైన పరిపాలన తాము అందించామని, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆ శక్తులను ప్రోత్సహించిందని కేసిఆర్ అంటున్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడడానికి తాము నడుం కట్టుకున్నామని, గంగా జమునా తెహజీబ్ ని పరిరక్షించడమే తన ధర్మంగా కేసీఆర్ స్పష్టం చేయడం కూడా తన ఎదురుదాడి వ్యూహంలో భాగంగానే భావించాలి. దీనికి ఉదాహరణగా గణేష్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకొని మిలాద్ ఉన్ నబీ ప్రదర్శన తేదీని మత పెద్దలు పొడిగించిన విషయం గుర్తు చేశారు. దీని ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు, మతసామరస్యాన్ని దెబ్బతీసే శక్తులు చెలరేగిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

మొత్తానికి కేసిఆర్ ఈ మాటల ద్వారా గతంలో జరిగిన మతకల్లోలాల ప్రస్తావనను పరోక్షంగా చేస్తూ, కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఇరకాటంలో పెట్టాలని చూసినట్టుగా కనిపిస్తుంది. మరోపక్క బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, కేసీఆర్ పరిపాలనను ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా అభివర్ణించారు. బిజెపి తరచుగా కేసిఆర్ మీద విసిరే విమర్శనాస్త్రాలలో కుటుంబ పాలన అనేది ముఖ్యమైనది. అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాల ప్రచార హోరు, ఇటు బిజెపి సాగిస్తున్న కుటుంబ పాలన విమర్శల జోరు, రెండింటినీ ఒకే దెబ్బతో ఢీకొనాలని కేసీఆర్ ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారనిపిస్తోంది.

ఆ రెండు పార్టీలు గాని అధికారంలోకి వస్తే తాము కాపాడుతున్న మతసామరస్యం తిరిగి దెబ్బతింటుందని ఆయన తెలంగాణ ప్రజలకు ఒక హెచ్చరిక చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన నోట మేనిఫెస్టో ప్రకటించిన మర్నాడే పథకాలు కాదు మా పని చూసి ఓటు వేయండి అనే మాట బయటకు వచ్చింది. మరి దీన్ని కాంగ్రెస్ వారు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.

Also Read:  T Congress : కాంగ్రెస్ గూటికి రేవూరి ప్రకాష్ రెడ్డి..బాబురావు..?