తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తభింపజేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో వరదలు వచ్చాయి. దాని నుంచి బయటపడక ముందే మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కడెం, భైంసా, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలు, సహాయక చర్యలు, వరద బాధితులను ఎయిర్‌లిఫ్టింగ్, ఇతర పనులకు ఉపయోగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే హెలిప్యాడ్‌లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, సాగునీటి ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూడాలని మంత్రిని కోరారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి కాలనీల్లోకి వరదనీరు చేరడంతో భైంసా పట్టణాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం కడెం డ్యాం వద్ద ఉధృతమైన వాతావరణం నెలకొంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డ్యామ్ ఉనికికే ముప్పు ఏర్పడింది. కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న 24 గ్రామాలకు చెందిన దాదాపు 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.