KCR Vs Revanth : కేసీఆర్ ఎత్తుగ‌డ‌తో రేవంత్ చిత్తు

కేసీఆర్ మామూలోడు కాదు...ప్ర‌జాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం ఏ పార్టీ ఉండాలో కూడా నిర్దేశించే ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో దిట్ట‌.

  • Written By:
  • Updated On - November 18, 2021 / 01:39 PM IST

కేసీఆర్ మామూలోడు కాదు…ప్ర‌జాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం ఏ పార్టీ ఉండాలో కూడా నిర్దేశించే ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో దిట్ట‌. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధికార పార్టీ టీఆర్ఎస్. ప్ర‌తిప‌క్షం ఏద‌ని ప్ర‌శ్నించుకుంటే, సామాన్యుల్లో బీజేపీనా? కాంగ్రెస్ పార్టీనా? అనే సందేహం క‌లుగుతుంది. అసెంబ్లీలో అధికారికంగా ప్ర‌తిప‌క్ష పార్టీగా కాంగ్రెస్ ఉంది. అక్క‌డ దాని బలం బీజేపీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌. కానీ, ప్ర‌జాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం ప్ర‌స్తుతం బీజేపీ క‌నిపిస్తోంది.

Also read : అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తాం- సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం త‌రువాత రాజ‌కీయ ప‌రిణామాలు క్షేత్ర స్థాయిలో మారిపోయాయి. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌ధ్య మాట‌ల యుద్ధం గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తోంది. దీన్ని చూసిన వారంతా నిజంగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్యే 2023 ఎన్నిక‌ల్లో పోటీ ఉంటుంద‌ని భావిస్తుంటారు. కానీ, ఏడాదిన్నరగా జ‌రిగిన‌ రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే, టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం ఏ పార్టీ ఉండాలో కేసీఆర్ నిర్ణ‌యిస్తున్నాడ‌ని బోధ‌ప‌డుతుంది. రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీకరించిన త‌రువాత 21 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ కు గట్టి ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ ఉంది. కేవ‌లం ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ అసెంబ్లీలో వెల‌వెల‌బోయింది. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో న‌లుగురు ఎంపీల‌ను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీల‌తో స‌రిపెట్టుకుంది. ఆనాటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం బీజేపీ అంటూ స్లోగ‌న్ ఆ పార్టీ నేత‌లు వినిపించారు. పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంతో అంద‌రూ ఆ స్లాగ‌న్ ను బ‌లంగా న‌మ్మారు. ఆ త‌రువాత జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ కంటే ఎక్కువ‌గా ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు కాంగ్రెస్ కు రావ‌డంతో నిజ‌మైన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ అనేది అర్థం అయింది.

గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీ ఓడిపోయిన‌ప్ప‌టికీ రెండో స్థానంలో నిల‌బ‌డింది. మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. దీంతో బీజేపీ మాత్ర‌మే టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం అంటూ ఆ పార్టీ వ‌ర్గాలు మ‌రోసారి ఊద‌ర‌గొట్టాయి. అదే స‌మ‌యంలో దుబ్బాక ఉప ఎన్నిక రావ‌డం, దానిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ర‌ఘ‌నంద‌న‌రావు స్వ‌ల్ప మెజార్టీతో గెలుపొందాడు. ఇంకేముంది, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంద‌ని ప్ర‌చారం విస్తృతంగా జ‌రిగింది. కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలోనే హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక వ‌చ్చింది. ఆ ఎన్నిక‌లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఇదే ఈక్వేష‌న్ నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ క‌నిపించింది. ఆ రెండు చోట్ల బీజేపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు రాక‌పోవ‌డంతో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ అనే స్లోగ‌న్ వినిపించింది.

Also Read : కేసీఆర్ మూడుసార్లు `ప్రెస్ మీట్‌` లోగుట్టు ఇదే!

అదే దూకుడుతో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నియ‌మించింది. ఆయ‌న చేసిన రైతు పాద‌యాత్ర‌, ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌లు, జంగ్ సైర‌న్ కార్య‌క్ర‌మాలు హైలెట్ అయ్యాయి. వాటికి వ‌చ్చిన స్పంద‌న చూసిన వాళ్లు 2023 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్లేష‌ణ‌లు చేశారు. హ‌ఠాత్తుగా హుజురాబాద్ ఉప ఎన్నిక రావ‌డం, ఈటెల బీజేపీ అభ్య‌ర్థిగా గెల‌వ‌డంతో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ మాత్ర‌మే అనే వాదం తిరిగి బ‌‌య‌ట‌కు వ‌చ్చింది. దానికి మ‌రింత బ‌లం చేకూరేలా కేసీఆర్ బీజేపీ మీద యుద్ధం ప్ర‌క‌టించాడు. ఫ‌లితంగా పొలిటిక‌ల్ గ్రౌండ్లో గులాబీ, క‌మ‌ల నాథులు హైలెట్ గా నిలిచారు. పీసీసీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వం మీద కేసీఆర్ పైన వ్య‌క్తిగ‌తంగా అనేక ఆరోప‌ణ‌లు రేవంత్ చేశాడు. ప్ర‌భుత్వంపైన‌, కేసీఆర్ కుటుంబ స‌భ్యుల ఆస్తుల గురించి రేవంత్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల మూడు ప్రెస్ మీట్లు పెట్టిన కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా రేవంత్ పేరుగానీ, కాంగ్రెస్ పేరుగానీ ఎత్త‌లేదు. పైగా కాంగ్రెస్ పార్టీని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రంలేద‌నే ధోర‌ణిలో మీడియా ముందు సైట‌ర్ వేశాడు.

ఇదంతా చూస్తుంటే, రేవంత్ రెడ్డి హైలెట్ కాకుండా టీఆర్ఎస్‌, బీజేపీ ఆడుతున్న గేమ్ లాగా క‌నిపిస్తుంది. లేదంటే, కేసీఆర్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగాల్సిన అవ‌స‌రం లేదు. కేంద్రంతో లైజ‌నింగ్ చేసి వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌నే కాదు, ఎలాంటి స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించుకునే చాక‌చ‌క్యం ఆయ‌న‌కు ఉంది. వాస్త‌వంగా వ‌రి అంశంపైన తొలుత కాంగ్రెస్ పోరాటాలు చేసింది. వాటిని మ‌రిపించేలా కారు, క‌మ‌లం ద‌ళాలు క‌దంతొక్కుతున్నాయి. కాంగ్రెస్ ఊసే క్షేత్ర స్థాయిలో లేకుండా పోయింది. ఈ ప‌రిణామం చూస్తుంటే ప్ర‌స్తుతానికి బీజేపీని ప్ర‌త్యామ్నాయంగా కేసీఆర్ కోరుకుంటున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇదే పంథాను 2023 వ‌ర‌కు కొన‌సాగిస్తారా? లేక మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చే ఎత్తుగ‌డ ఎన్నిక‌ల నాటికి వేస్తారా? అనేది చూడాల్సిందే!