కేసీఆర్ వర్సెస్ ఈసీ.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్?

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 28, 2021 / 12:08 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. ఉపఎన్నికలు అయిపోయే దాకా ప్రభుత్వం ఎలాంటి ప్రలోభాలకు పాల్పడనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉప ఎన్నికల నేపథ్యంలో మొదట హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితంగా ఉండాల్సిన ఆంక్షలు ఆ నియోజకవర్గానికి పక్క జిల్లాలైన కరీంనగర్, హనుమకొండ జిల్లాలకు కూడా వర్తింపజేశారు. ఉప ఎన్నిక అయిపోయేదాకా హుజురాబాద్ తో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 27న హన్మకొండలో ఒక బహిరంగసభ నిర్వహించి దళితబంధు అంశం పెట్టాల్సిన అవసరం, దాని తదుపరి కార్యక్రమాలపై ప్రజలకు సీఎం కేసీఆర్ ఒక క్లారిటీ ఇద్దామనుకున్నారు. ఆ మీటింగ్ ప్రభావం హుజురాబాద్ ప్రజలపై ఉంటుందని భావించిన ఈసీ కేసీఆర్ మీటింగ్ కోసం ప్లాన్ చేసుకున్న హన్మకొండ జిల్లాలో కూడా ఆంక్షలు విధించింది.

ఇటీవల జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ ఈ విషయాలపై స్పందించారు. ఎన్నికల కమీషన్ తన లిమిట్స్ దాటుతోందని, ఒక సీనియర్ రాజకీయనాయకుడిగా ఈ విషయాన్ని చెపుతున్నానని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రిని, అభివృద్ధి కార్యక్రమాలను ఈసీ కట్టడి చేస్తోందని ఇది సరైన పద్దతి కాదని కేసీఆర్ విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలపై మొదటినుండి ఒక మిక్సీడ్ టాక్ ఉన్నది. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మీటింగ్ పెట్టి ప్రజల అభిప్రాయాలను తన వైపు తిప్పుకోగలడని అందరూ అనుకున్నారు. అయితే మీటింగ్ పెట్టి ప్రజలకు సందేశం ఇచ్చే ప్రధాన అవకాశం కేసీఆర్ కోల్పోయాకా రిజల్ట్ ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నట్టు సమాచారం.