చైత్ర పై కేటీఆర్ ట్వీట్ డ్రామా

  • Written By:
  • Updated On - September 17, 2021 / 12:45 PM IST

సాధార‌ణంగా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం స్పందిస్తుంది. జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం సంబంధిత కుటుంబానికి భ‌రోసా ఇవ్వ‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంది. కానీ, హైద్రాబాద్ సింగ‌రేణికాల‌నీకి చెందిన చైత్ర అత్యాచారం, హ‌త్య తెలంగాణ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌లేదు. స‌రైన రీతిన స్పందించలేదు. పైగా కేటీఆర్ ట్వీట్ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఆ త‌రువాత దాన్ని వెన‌క్కు తీసుకున్నారు. ఇదే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

చైత్ర సంఘ‌ట‌న వారం క్రితం జ‌రిగింది. అత్యాచారం, హ‌త్య జ‌రిగిన త‌రువాత మొద‌టి రెండు రోజులు మీడియా లైట్ తీసుకుంది. ప్ర‌భుత్వం ఇంకా లైట్ తీసుకుంది. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగా స్పందించారు. ప్ర‌జా సంఘాలు రంగంలోకి దిగాయి. ఫ‌లితంగా సంఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల త‌రువాత ప్ర‌భుత్వం ఆల‌స్యంగా మేల్కొని రూ. 50వేలు న‌ష్ట‌ప‌రిహారం, ఇంటి స్థ‌లం, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామ‌ని క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, రెండో ప‌వ‌ర్ పాయింట్ గా ఉన్న కేటీఆర్ గానీ, క‌విత‌గానీ, హ‌రీశ్ గానీ స్పందించ‌క‌పోవ‌డం దుర‌దృష్టం. హోం మంత్రిగా ఉన్న మ‌హ్మ‌మూద్ ఆలీ నుంచి క‌నీస స్పంద‌న క‌రువు అయింది. మ‌హిళా చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న సునీతాల‌క్ష్మారెడ్డి సంఘ‌ట‌న స్థ‌లానికి రాక‌పోగా, దారుణానికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకోవాల‌న్న క‌నీస ధ‌ర్మాన్ని పాటించ‌లేదు.

ఇక విప‌క్షాలు కూడా ఆల‌స్యంగా రంగంలోకి దిగడం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌ను ప్ర‌శ్నిస్తోంది. సంఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల త‌రువాత తొలుత బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్ గా ఉన్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సింగ‌రేణికాల‌నీ చైత్ర ఇంటికి వెళ్లారు. ప‌సిపాప‌పై జ‌రిగిన ఘోరాన్ని చూసి చ‌లించిపోయారు. ద‌ళితులు, గిరిజ‌నులు బడుగుల కుటుంబాల‌కు జ‌రుగుతోన్న అన్యాయాన్ని ప్ర‌శ్నించారు. చైత్ర గిరిజ‌నుల‌కు చెందిన ప‌సిపాప కాబ‌ట్టి, ప్ర‌భుత్వం స‌రైన స‌మ‌యంలో స్పందించ‌లేద‌ని ఆరోపించారు. అగ్ర కుల మీడియా చైత్ర సంఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా చూపించ‌లేక‌పోయింద‌ని ఆగ్ర‌హించారు. రాజ్యాధికారం అందుకే..బ‌డుగుల‌కు కావాల‌ని నిన‌దించారు. ఆ త‌రువాత కొద్దిసేప‌టికి కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ అక్క‌డికి చేరుకున్నారు. త‌న‌దైన శైలిలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. క‌లెక్ట‌ర్ కు అక్క‌డి నుంచే ఫోన్ చేసి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని నిల‌దీశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌ల మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు సంచ‌ల‌నం కలిగిస్తున్నాయి. ఏపీలో ర‌మ్య‌, అనూష‌..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘోరాలు జ‌రిగాయి. అందుకే దిశ చ‌ట్టాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. కానీ, అంది చ‌ట్ట రూపంలోకి రావాలంటే కేంద్రం నుంచి అనుమ‌తి అవ‌స‌రం. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా నిర్భ‌య చ‌ట్టం అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ కోర‌లు లేని చ‌ట్టంగా మిగిలిపోయింది. నేరం జ‌రిగిన త‌రువాత వెంట‌నే శిక్ష ప‌డే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. అందుకే, త‌క్ష‌ణం చైత్ర‌ను అత్యాచారం చేసి, హ‌త్య చేసిన రాజును త‌మ చేత‌ల‌కు అప్ప‌గించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. గ‌ల్ఫ్ దేశాల్లో మాదిరిగా బ‌హిరంగ ఉరి తీయాల‌ని డిమాండ్లు పెరుగుతున్నాయి.

తెలంగాణలో రాజకీయం అంతా చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన చుట్టూ తిరుగుతోంది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై రాజు అనే దుండగుడు కిరాత‌కానికి పాల్పడిన ఘటనపై రాజకీయ దుమారం పెరుగుతోంది. మంత్రి కేటీఆర్ నిందితుడ్ని అరెస్ట్ చేశామని ప్రకటించారు. కానీ అరెస్ట్ చేయలేదని తరవాత తెలిసిందని ఆయన ట్వీట్ సవరించుకున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఎవరూ ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించలేదని  ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ చిన్నారి కుటుంబానికి పరామర్శల కోసం రాజకీయ నేతలు, సామాజిక సమస్యలపై స్పందించే ఇతర ప్రముఖులు క్యూ కడుతున్నారు.


హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు జరుగుతున్న సమయంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. అంతకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం నుంచి పాప కనిపించడం లేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎంతకీ కనిపించలేదు. దీంతో వారి బస్తీలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండే రాజుపై అనుమానం వచ్చింది. అర్థరాత్రి సమయంలో రాజు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. రాజు ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై బస్తీ వాసులంతా ఆందోళనకు దిగారు.నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. చివరికి పోలీసులు నచ్చ  చెప్పి అంత్యక్రియలు చేయించారు. కానీ నిందితుడ్ని మాత్రం పట్టుకోలేదు. ఇప్పుడు పోలీసులు రూ. పది లక్షల రివార్డును ప్రకటించారు.

సమాచారాన్ని మొబైల్ ఫోన్ నంబర్లు 94906 16366 లేదా 94906 16627 కు పంపించవచ్చని పోలీసులు తెలిపారు.

నేరం జరిగిన తర్వాత గత గురువారం నుంచి పరారీలో ఉన్న రాజును పట్టుకునేందుకు సిటీ పోలీసు పది బృందాలు ప్రస్తుతం పనిలో ఉన్నాయి. చైత్ర తన ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు రాజు కిడ్నాప్ చేసాడు. పాప‌ను  లైంగిక వేధింపులకు గురిచేసి తన గదిలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. రాత్రి తర్వాత అతని ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసు సిబ్బందిపై రాళ్లు మరియు మిరప పొడిని విసరడంతో ఉద్రిక్తత నెలకొంది.రాజును పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల త‌నిఖీలు చేశారు. కానీ ఇప్పటి వరకు విఫలమయ్యారు. కేసును పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.