CM KCR: కేంద్రంపై కేసీఆర్ ‘వరి వార్’

ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగు చేసిన వరి బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనను మళ్లీ ప్రారంభించి

  • Written By:
  • Publish Date - March 20, 2022 / 10:35 AM IST

ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగు చేసిన వరి బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనను మళ్లీ ప్రారంభించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆయన సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా యూనిట్ల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీలు, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల అధ్యక్షులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

శనివారం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం నాటి సమావేశం ముగిసిన వెంటనే సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీని కలవనుంది. పంజాబ్‌లో పండే వరి మొత్తం కేంద్రం సేకరిస్తున్నదని, రాష్ట్రంలో పండే వరిధాన్యాన్ని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని చంద్రశేఖర్‌రావు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌లో ముఖ్యమంత్రి స్వయంగా ధర్నాకు దిగి టీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.