తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కారణం ప్రజా ఉద్యమమా? కాంగ్రెస్ అహంకారమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రివిలేజ్ కమిటీ ఎదుట తేల్చుకోవడానికి టీఆర్ఎస్ రెడీ అయింది. మోడీపై రాజ్యసభలో నోటీస్ ఇవ్వడానికి ఉన్న న్యాయపరమైన అంశాలను ఆ పార్టీ పరిశీలిస్తోంది. రాజ్యసభ ఎంపీ కేశవరావు అధ్యర్యంలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ టీం ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ మేరకు న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి నిపుణులతో ఢిల్లీలో కేశవరావు సమావేశం అయ్యాడు. పార్లమెంట్లో మోడీపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఎలా ఏర్పడింది? విభజన చట్టంలోని అంశాలను ఎందుకు అమలు చేయడంలేదు? అనే అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్లాన్ చేస్తున్నారు.వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 1994లోనే ప్రత్యేక రాష్ట్రం అంశం ఉంది. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల్లో అ అంశం మూలనపడింది. చంద్రబాబునాయుడుతో విభేదించి టీడీపీ నుంచిబయటకొచ్చిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని2001 నుంచి రేకెత్తించాడు. క్షేత్ర స్థాయిలోని ప్రజల మనోభావాలను గమనించిన కాంగ్రెస్ 2004 ఎన్నికల మేనిఫెస్టోలో మళ్లీ ప్రత్యేకతెలంగాణ అంశాన్ని పెట్టింది. ప్రతి సభలోనూ సోనియాతో తెలంగాణ ప్రజలకు హామీ ఇప్పించారు. ఆనాడు చంద్రబాబును రాజకీయంగా అడ్డుకోవడానికి ఈ అంశం బాగా పనిచేస్తుందని కాంగ్రెస్ అంచనావేసింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2004లో కాంగ్రెస్ గాలి వీయడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ తో పాటు అడుగు పెట్టారు. అప్పటినుంచి ప్రతి సందర్భంలోనూ అసెంబ్లీ బయట,లోపల తెలంగాణ సెంటిమెంట్ ను రాజకీయంగా రగిలించారు. కానీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నంత కాలంగా పెద్దగా ప్రత్యేక రాష్ట్ర వాదం రాజకీయంగా వినిపించకుండా చేయగలిగాడు. అడపాదడపా జరిగే ఆందోళనలను ఆయన కంట్రోల్ చేస్తూ వచ్చాడు. కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీపై సీడబ్ల్యూసీ లో సోనియా ఒత్తిడి చేయడంతో ఏకాభిప్రాయం కోసం ప్రణబ్ కమిటీని ఆనాడు వేశారు. ప్రత్యర్థి పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ తన పద్మవ్యూహంలోకి లాగింది.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ కోసం ప్రణబ్ కమిటీలోకి లేఖలు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సీపీఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని లేఖలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. 2009 సాధారణ ఎన్నికలకు ముందే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేయాలని సోనియా గ్రౌండ్ ప్రిపేర్ చేశారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలకు తెలుసు. కానీ, స్వర్గీయ వైఎస్ ఆర్ ఒత్తిడి మేరకు ఆనాడు వాయిదా పడిందని ఢిల్లీ పెద్దలు ఇప్పటికే చెబుతుంటారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన టీడీపీ,టీఆర్ఎస్, వామపక్షాలు కూటమిగా 2009 ఎన్నికలకు వెళ్లాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇక తెలంగాణ రావడం కష్టమే అనుకున్నారు. అకస్మాత్తుగా రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లాడు. ఆనాడున్న సీఎం రోశయ్య మెతకవైఖరి కారణంగా నిఘా గట్టుతప్పింది. ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతే శాంతిభద్రతలు కాపాడే పరిస్థితి లేదనే కోణంలో నిఘా నివేదిక ఇచ్చాడని సమైఖ్యవాదులు ఇప్పటికీ చెబుతుంటారు.ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోయాడని రోశయ్య బదులుగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టింది. ఇక ఆనాటి నుంచి రాజకీయపరమైన చాణక్యానికి కేసీఆర్ పదును పెట్టాడు. అప్పటికే రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోని కోర్ కమిటీకి సోనియా తెలియచేసింది. రాజకీయంగా నష్టపోయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దామని ఆమె సిడబ్ల్యూ సమావేశాల్లో చాలా క్లారిటీగా చెప్పింది. ఆ విషయం రాష్ట్రంలోని సీనియర్లు, సీఎంలుగా ఉన్న వాళ్లకు తెలుసు. అందుకే, ఉద్యమాన్ని అదుపు చేయలేక, సమైఖ్య వాదులను కాదనలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చాడట. దాంతో ఇక సోనియా మరో ఆలోచన చేయకుండా రాష్ట్రాన్ని విడదీస్తున్నట్టు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం ద్వారా వెల్లడించింది. ఒకవైపు ఉద్యమం చేస్తూనే కేసీఆర్ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
కాంగ్రెస్ అహంకారం, రాజకీయ దాహం కారణంగానే ఉమ్మడి ఏపీ విడిపోయిందని తాజాగా ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కించపరిచాడని టీఆర్ఎస్ లాజిక్ లాగింది. ఉద్యమం కంటే కాంగ్రెస్ అహంకారం కారణంగా ఉమ్మడి ఏపీ విడిపోయిందని మోడీ తేల్చేశాడు. పరోక్షంగా తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన మోడీపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే, మరోసారి పార్లమెంట్ వేదికగా తెలంగాణ సెంటిమెంట్ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సమైఖ్యవాదం మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మోడీ చుట్టూ పద్మవ్యూహం అల్లొచ్చని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. సో..ప్రివిలేజ్ మోషన్ మూవ్ అయితే…విభజన అంశాలు, ఉద్యమంలోని లోగట్టు తదితర అంశాలపై రసవత్తర చర్చ జరిగే అవకాశం ఉందన్నమాట.