Site icon HashtagU Telugu

Mamta Banerjee : త్వ‌ర‌లో బెంగాల్ కు సీఎం కేసీఆర్, తెలంగాణ మోడ‌ల్ ఫోక‌స్!

Kcr And Mamatha

Kcr And Mamatha

గుజ‌రాత్ మోడ‌ల్ ను చూప‌డం ద్వారా 2014 ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌ధాని పీఠాన్ని అందుకున్నారు. సేమ్ టూ సేమ్ అదే పంథాను తెలంగాణ సీఎం కేసీఆర్ అనుస‌రిస్తున్నారు. తెలంగాణ మోడ‌ల్ ను దేశానికి చూప‌డం ద్వారా 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని పీఠాన్ని ముద్దాడాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్ర‌మంలో దేశంలోని బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల‌కు ఆయ‌న వెళుతున్నారు. అక్క‌డి సీఎంల‌కు తెలంగాణ అభివృద్ధి మోడ‌ల్ ను చూపిస్తున్నారు. వాళ్ల నుంచి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ అభివృద్ధి మోడ‌ల్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డంతో కేసీఆర్ దూకుడు పెంచారు. జాతీయ వ్య‌వ‌సాయ విధానం దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ఇప్ప‌టికే 26 రాష్ట్రాల‌కు చెందిన రైతు నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్ వాళ్లలోని కొంద‌ర్ని వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దింపాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేస్తున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, క‌ర్నాట‌ర రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో రైతు నాయ‌కుల‌ను అభ్య‌ర్థులుగా పెట్టాల‌ని యోచిస్తున్నారు. అందుకోసం ఆయా రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర పార్టీల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు సిద్ధం అయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రానికి వెళ్ల‌నున్నారు. బెంగాల్ పర్యటన తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటక , హిమాచల్ ప్రదేశ్‌లను సందర్శిస్తారు. అక్కడ అతను రైతు సంఘాలు, ఇతర సంస్థల నాయకులతో సమావేశమై “తెలంగాణ మోడల్” సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శిస్తాడు.

ఆయా రాష్ట్రాల్లో రైతు బంధు, బీమా త‌దిత‌ర‌ పథకాలను ఎజెండాగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. స్వతంత్రులకు మద్దతు ఇవ్వడం ప్రతిపక్ష భాగస్వాములపై ​​ప్రభావం చూపదా అని అడిగిన ప్రశ్నకు, రెండు లేదా మూడు స్థానాల్లో రైతు నాయకులకు మద్దతు ఇచ్చేలా బిజెపియేతర పార్టీలను సంప్రదించి వారిని ఒప్పించాలని సిఎం భావిస్తున్నారని టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న స‌మాచారం. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్‌లో, గుజరాత్‌లో డిసెంబర్‌లో, కర్ణాటకలో వచ్చే మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. “బీజేపీ ముక్త్ భారత్” అనే నినాదంతో ఈ రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

రాబోవు రోజుల్లోనూ రాష్ట్రాలకు కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ మోడల్‌ను అమలు చేసేందుకు జాతీయ స్థాయిలో రైతు ఐక్యవేదికను ప్రారంభించాల‌ని యోచిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఇటీవల ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో 25 రాష్ట్రాల రైతు నాయకులు చేసిన తీర్మానానం చేసిన విషయం విదిత‌మే.

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి తెలంగాణను సాధించుకున్న ఏకైక నేతగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్తోన్న ప్ర‌శంస కేసీఆర్ ను మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్ల‌డానికి ఉప‌యోగ‌ప‌డుతోంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు జాతీయ స్థాయి ప్ర‌చారాన్ని చేయ‌డం ద్వారా ప్ర‌ధాని పీఠాన్ని అందుకోవాల‌ని కేసీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.