KCR Grades: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘కేసీఆర్’ ర్యాంకులు!

వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన స్టయిల్ లో ముందుకుసాగుతున్నారు.

  • Written By:
  • Updated On - April 19, 2022 / 12:40 PM IST

వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేజిక్కించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన స్టయిల్ లో ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించిన ఆయన.. తాజాగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ప్రజల్లో సానుకూలత ఉందా? లేదా విషయాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వబోతున్నారు. సర్వే పూర్తి రిపోర్ట్ కేసీఆర్ చేతికందడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్లో టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి గ్రేడ్‌లు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. పార్టీ వర్గాల ప్రకారం.. ప్రత్యేక స్వతంత్ర ఏజెన్సీలు ఇటీవల చేసిన మూడు సర్వేల ఆధారంగా గ్రేడ్‌లు ఉంటాయి.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడానికి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ బృందంతో సహా మూడు ఏజెన్సీలకు సర్వేలను అప్పగించారు. సర్వే ఫలితాలను గతవారం కేసీఆర్ కు సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తూ చేస్తూ ప్రతి శాసనసభ్యుడికి గ్రేడ్‌లు ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్ ఇవ్వాలా లేదా తిరస్కరించాలా? అనే విషయంపై ఈ గ్రేడ్‌లు నిర్ణయాత్మకంగా మారతాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా, ఈసారి ముందుగానే టిక్కెట్లు ఇచ్చేలా ఎన్నికలకు ఆరు నెలల ముందే టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది.

“విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పలు కళాశాలలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రతి ఎమ్మెల్యే పనితీరును పరిగణనలోకి తీసుకుని, రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు అభిప్రాయాలను తీసుకోనున్నన్నారు ”అని సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు ఒకరు తెలిపారు.  నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం, ఎమ్మెల్యే సాధించిన అభివృద్ధి, ప్రజల ఫిర్యాదులు, ఫిర్యాదులపై స్పందించిన తీరు, వ్యక్తిత్వ లక్షణాలు, వ్యక్తులకున్న ఆదరణ తదితర అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు గ్రేడ్‌లు ఇస్తున్నారు.