KCR to avoid PM: ఈసారి కూడా కలిసేది లేదు…ప్రధాని టూర్‌కు కేసీఆర్ డుమ్మా..?

రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం...ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 12:11 AM IST

రాష్ట్ర సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం…ఈ రెండు ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణకు ఇప్పట్లో ముగింపులేనట్లు కనిపిస్తోంది. ఎడమొహం పెడ మొహం అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు ఉండటంతో…వీటి మధ్య మరింత దూరం పెరుగుతోంది. ఈ నెల 26వ తేదీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలుకుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని హోదాలో మోదీ గతంలో హైదారబాద్ పర్యటనకు వచ్చారు. అప్పుడు కేసీఆర్ మోదీకి ఆహ్వానం పలకలేదు. కేసీఆర్ డుమ్మా కొట్టడంపై రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ముచ్చింతల్ లో సమతామూర్తివిగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి కేసీఆర్ కనీస మార్యదకూడా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఈనెల 26న గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్యఅతిథిగా రానున్నారు.

అయితే అదే కేసీఆర్ బెంగుళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడతోపాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి కూడా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లే అవకాశం లేదని అధికారుల్లో చర్చ జరుగుతుంది. ఈ పర్యటన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరింత వైరం పెరిగే అవకాశం ఉండే అవకాశం లేకపోలేదు.

కాగా రాష్ట్రానికి అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందనే సీఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మోదీ టూర్ కు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై మోదీకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. మొత్తానికి మే 26న కేసీఆర్ హైదరాబాద్ లో ఉంటారా? బెంగుళూరు వెళ్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.