Site icon HashtagU Telugu

KCR Munugode Formula: 2023 ఎన్నికలపై కేసీఆర్ ‘మునుగోడు’ ఫార్ములా!

Munugode

Munugode

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సహకారంతో పార్టీ విజయంపై ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులనే ఇంచార్జ్‌లుగా కొనసాగించాలని నిర్ణయించారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై టీఆర్‌ఎస్ అధినేత సంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాన్ని 80 యూనిట్లుగా విభజించి, దాదాపు 100 మంది ప్రజా ప్రతినిధులు మోహరించేలా పక్కా ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు. మంత్రులతో సహా పార్టీ నేతలను చిన్న గ్రామాలకు కూడా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయకముందే వారు నియోజకవర్గాన్ని సందర్శించి మరింత ఆసక్తిని రేపారు కేసీఆర్.

అయితే ఇన్‌చార్జ్‌ల నియామకం కొత్త ప్రక్రియ కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని అమలు చేశారు. కానీ ఇప్పుడు మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకు ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో కార్యదర్శికి రెండు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు, ప్రతి ముగ్గురి నుంచి నలుగురు కార్యదర్శులకు ఒక ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్‌గా ఉండేలా వ్యూహం రచించారు. మంత్రులు తమ నియోజకవర్గంతో పాటు సమీపంలోని నియోజకవర్గాలను ప్రభుత్వ కార్యక్రమాలు, నాయకుల పనితీరును గమనిస్తూనే ఉంటారని కిందిస్థాయి టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు.

అయితే, సొంత నియోజకవర్గంపై దృష్టి సారించడం వల్ల మంత్రులకు ఇది ఇబ్బందిగా మారుతుందని, ఇది అదనపు ఆర్థిక భారం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగే శాసనమండలి, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ  అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉపఎన్నికల్లో కొందరు మంత్రుల వైఫల్యంపై ఓ సీనియర్ మంత్రిని ప్రశ్నించగా.. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఓట్ల మార్జిన్ పెంపుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇన్‌చార్జి వ్యవస్థతో మునుముందు ఎన్నికల్లో అదే ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.