KCR BRS PARTY: కేసీఆర్ అస్త్రం `ఉత్త‌ర‌భార‌త్` పెత్త‌నం!

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌న్నీ దాదాపుగా ప్ర‌జ‌ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంటాయి.

  • Written By:
  • Updated On - June 13, 2022 / 12:10 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌న్నీ దాదాపుగా ప్ర‌జ‌ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంటాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఆయ‌న ర‌చించిన వ్యూహాలు ఆ విష‌యాన్ని తేట‌తెల్లం చేస్తాయి. జాతీయ పార్టీకి జెండా, అజెండా ఫిక్స్ చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోన్న కేసీఆర్ జాతీయ వాదంలో ప్రాంతీయ వాదాన్ని చొప్పించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రానికి ప‌దును పెట్ట‌డానికి ఆయ‌న ఆంధ్రా ప్రాంతం వారిని టార్గెట్ చేశారు. వాళ్ల‌ను శ‌త్రువులుగా చూపుతూ తెలంగాణ సీఎంగా రెండోసారి విజ‌య‌వంతంగా అయ్యారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేయ‌డంలోనూ ఆంధ్రా వాళ్ల‌ను విల‌న్లుగా చిత్రీక‌రించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆంధ్రా బూచి చూపించి స‌క్సెస్ అయ్యారు.

భార‌త రాష్ట్రీయ స‌మితి లేదా భార‌తీయ రాష్ట్ర స‌మితి పార్టీ పెట్టాల‌నుకుంటోన్న కేసీఆర్ అజెండా కూడా ఇంచుమించు తెలంగాణ ఉద్య‌మాన్ని లేపిన విధంగానే ఫిక్స్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలంటే రాజ‌కీయ వ్యూహంతో పాటు ద‌క్షిణ భార‌త‌దేశం అనే సెంటిమెంట్ ను రంగ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. దాన్ని ప్ర‌త్యేక తెలంగాణ సెంటిమెంట్ లాగా పండించ‌డానికి ప్ర‌శాంత్ కిషోర్‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, ఇత‌ర రంగాల మేధావుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఫాంహౌస్ కేంద్రంగా ప్ర‌శాంత్ కిషోర్ ర‌చించిన వ్యూహానికి కేసీఆర్ మ‌రింత సాన‌ప‌డుతున్నార‌ని సమాచారం. అందుకోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజ్ ను వాడుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.

కొన్ని ద‌శాబ్దాలుగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త దేశం మ‌ధ్య ఢిల్లీ కేంద్రంగా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. ఎప్పుడూ ఉత్త‌ర భార‌త‌దేశం పెత్త‌నం దేశంపై ఉంటుంది. దేశ రాజ‌ధాని, అక్క‌డి ప‌రిపాల‌న‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్ల‌కు ఉత్త‌ర‌భార‌త‌దేశం పెత్త‌నం క‌నిపిస్తోంది. అనేక సంద‌ర్భాల్లో ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడులోని జ‌ల్లిక‌ట్టు ఆట గురించి ఉద్య‌మం జ‌రిగిన‌ప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్త‌ర భార‌త దేశం పెత్త‌నాన్ని ప్రశ్నించారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌, శాండిల్ వుడ్ కు చెందిన హీరోలు కొంద‌రు జ‌న‌సేనాని గ‌ళానికి మ‌ద్ద‌తు ప‌లికారు. ఫ‌లితంగా జ‌ల్లిక‌ట్టు ఆట‌కు ప్ర‌త్యేక అనుమ‌తులు కేంద్రం ఇచ్చింది. ఇదంతా న‌రేంద్ర మోడీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన అంశం.

నిధుల విడుద‌ల విష‌యంలోనూ ద‌క్షిణ భార‌త‌దేశంపై తొలి నుంచి వివ‌క్ష ఉంది. ఆ విష‌యాన్ని 2019 ఎన్నిక‌ల. సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ డేటాతో స‌హా చెప్పారు. ఆ ఎన్నిక‌ల్లో మోడీని వ్య‌తిరేకించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ధ‌ర్మ‌పోరాట వేదిక‌పై వినిపించారు. ఆ సంద‌ర్భంగా బీహార్‌, యూపీ, రాజ‌స్తాన్‌, మ‌ద్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర ఉత్త‌ర భార‌త‌దేశానికి చెంద‌ని రాష్ట్రాల‌కు కేటాయించిన నిధుల గురించి వివ‌రించారు. ఢిల్లీ పెత్త‌నంపై పోరాడిన ఎన్టీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే పంథాను ఎంచుకున్నారు. మ‌రోవైపు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన అవ‌మానాన్ని ఎత్తిచూపాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. తొలి నుంచి ద‌క్షిణ భార‌త దేశంపై ఏ విధంగా ఉత్త‌ర‌భార‌త దేశం నేత‌లు వివ‌క్ష చూపారో..డేటాతో స‌హా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డానికి కేసీఆర్ సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌త్యేక తెలంగాణ వాదాన్ని రెచ్చ‌గొట్ట‌డానికి ఏ విధంగా ఆంధ్రా బూచిని విసిరారో, ఇప్పుడు ఉత్త‌ర‌భార‌త‌దేశ పెత్త‌నం అస్త్రాన్ని మోడీపై విస‌రబోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, చిన్న రాష్ట్రాల‌తోనే స‌మ‌గ్రాభివృద్ధి అంటూ పార్ల‌మెంట్ వేదిక‌గా ఉమ్మ‌డి ఏపీని విడ‌గొట్ట‌డానికి స‌హ‌కారం అందించిన బీజేపీని ఇరుకున‌పెట్టే మాస్ట‌ర్ స్కెచ్ కూడా రెడీ అవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న విభ‌జ‌న వాదాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నార‌ని టాక్‌. ఇలాంటి భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌శాంతి కిషోర్ మైండ్ ఎలా ప‌నిచేస్తుందో ఏపీలో చూశాం. ఇప్పుడు హిందీ భాష గురించి ద‌క్షిణ భార‌త‌దేశంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇలా సున్నిత‌మైన అంశాల‌ను అజెండాగా చేసుకుని మోడీ స‌ర్కార్ పై రాజ‌కీయ ఫైట్ చేయ‌డానికి కేసీఆర్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. సేమ్ టూ సేమ్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని ర‌క్తిక‌ట్టించిన త‌ర‌హాలోనే మోడీ స‌ర్కార్ పై యుద్ధానికి కేసీఆర్ దిగుతున్నార‌న్న‌మాట‌.