PK: కేసీఆర్ చాణక్యానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు.. అది తెలంగాణలో ఏ పార్టీకి చావుదెబ్బ?

ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరేవారికి తెలియదు. అదే టీఆర్ఎస్ ను గెలుపుబాట పట్టిస్తోంది.

  • Written By:
  • Updated On - February 28, 2022 / 08:28 AM IST

ఎన్నికల్లో ఎలా గెలవాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరేవారికి తెలియదు. అదే టీఆర్ఎస్ ను గెలుపుబాట పట్టిస్తోంది. ఇప్పుడు ఆయన వ్యూహాలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడయ్యాయి. అందులోనూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో కేసీఆర్ దూకుడు ఓ రేంజ్ లో ఉంది. అటు నేష‌న‌ల్ పాలిటిక్స్‌, ఇటు రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఏక‌కాలంలో దృష్టి పెట్టారు. అందులో భాగంగా మొద‌ట ప్రజ‌ల ప‌ల్స్ ఎలా ఉంద‌నే విష‌యాన్ని తెలుసుకునే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు ప్రజలకు ఎంత‌వ‌ర‌కు రీచ్ అయ్యాయి.. వాటి ద్వారా బెనిఫిట్ పొందిన వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయ‌నే సంగ‌తిని తెలుసుకుంటున్నారు.

కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్ నుంచే ప్రశాంత్ కిషోర్ వర్క్ ప్రారంభమైంది. ఇప్పటికే ప‌లుమార్లు స‌ర్వేలు జ‌రిపించి ఒక ఐడియాకు వ‌చ్చారు. ఎల‌క్షన్ స్ట్రాట‌జిస్టుగా దేశంలోనే పేరు పొందిన ప్రశాంత్ కిశోర్ ఈ విషయంలో ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఆయ‌న వ‌చ్చి ప్రజ‌ల‌ను నేరుగా క‌లిశారు కూడా. ప‌థ‌కాలు ఎలా అమ‌ల‌వుతున్నాయి? ఏ కులానికి ఎక్కువ బెనిఫిట్ క‌లిగింది? ప్రభావం చూపే సామాజిక వ‌ర్గాలు ఏమిటి? అన్న వివ‌రాల‌పై దృష్టి పెట్టారు.

ప్రభుత్వంపై వ్యతిరేక‌త ఎలా ఉందానేదానిపైనా trs ఆరా తీస్తోంది. ఉద్యోగులు, ప్రధానంగా యువ‌త‌, వివిధ వ‌ర్గాలు ప్రభుత్వంపై ఏమ‌నుంకుటున్నారు? వారిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి ఏమి చేయాల‌నేదానిపైనా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ప‌నిలో ప‌నిగా ప్రతిప‌క్షాల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌పైనా అంచ‌నాలు వేస్తున్నారు. వాటిని ఏ విధంగా దెబ్బకొట్టాల‌నేదానిపైనా వ్యూహాలు రూపొందిస్తున్నారు.

నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను ఏ విధంగా డీల్ చేయాల‌న్నదానిపై కూడా ప్రశాంత్ కిశోర్‌తో కేసీఆర్ చ‌ర్చలు జ‌రిపారు. ఆ పాలిటిక్స్‌ను సీరియ‌స్‌గానే తీసుకున్న కేసీఆర్ అక్కడ కూడా త‌న‌దైన స్టయిల్‌ను చూపించే అవ‌కాశం ఉంది. ప్రభుత్వ ప‌థ‌కాల ద్వార ఇత‌ర పార్టీల కింది స్థాయి నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ఉన్నారు. ముఖ్యంగా ద‌ళిత బంధు ద్వారా గ్రామ స్థాయి నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనే ప్రయ‌త్నాలు చేస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ సాయంతో అటు నేషనల్ పాలిటిక్స్ లోను, ఇటు లోకల్ రాజకీయాల్లోనూ మరోసారి చక్రం తిప్పడానికి కేసీఆర్ పెద్ద వ్యూహాన్నే తయారుచేశారు.