KCR Strategy: కాంగ్రెస్ పై `కేసీఆర్` వేట

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. రాజ‌కీయంగా న‌ష్టం జరుగుతుంద‌ని కొంద‌రు చెప్పిన‌ప్ప‌టికీ ఆడిన మాట త‌ప్ప‌కూడ‌ద‌ని ఏఐసీపీ అధ్యక్షురాలు సోనియా రాష్ట్ర విభ‌జ‌న చేశారు.

  • Written By:
  • Updated On - January 8, 2022 / 09:08 PM IST

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. రాజ‌కీయంగా న‌ష్టం జరుగుతుంద‌ని కొంద‌రు చెప్పిన‌ప్ప‌టికీ ఆడిన మాట త‌ప్ప‌కూడ‌ద‌ని ఏఐసీపీ అధ్యక్షురాలు సోనియా రాష్ట్ర విభ‌జ‌న చేశారు. ఏపీ నేత‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి వ‌చ్చిన‌ప్ప‌టికీ సోనియా ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌లేదు. 2004 ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ వేదిక‌ల‌పై ఆమె ఇచ్చిన ప్ర‌త్యేక రాష్ట్ర హామీని ప‌లుమార్లు సీడ‌బ్ల్యూసీ స‌మావేశాల్లో ప్ర‌స్తావించారు. వాస్త‌వంగా 2009 ఎన్నిక‌లకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్ద‌లు కొంద‌రు భావించారు. కానీ, ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ ఇచ్చిన హామీ మేర‌కు తాత్కాలికంగా రాష్ట్ర విభ‌జ‌న వాయిదా ప‌డింద‌ట‌. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు చెబుతుంటారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు స‌హ‌జంగా ఆదిరిస్తారు. ఆ విష‌యాన్ని గుర్తించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాల‌ని వ్యూహాన్ని ర‌చించాడు. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయ‌డానికి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే వ్యూహాత్మ‌కంగా టార్గెట్ చేశాడు. రాష్ట్ర విడిపోయిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 63 స్థానాల‌ను మాత్రం టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 21 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీ 15, బీజేపీ 5 స్థానాల్లో విజ‌యం సాధించాయి. తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ఏక‌ప‌క్ష విజ‌యం ఇవ్వ‌లేద‌ని ఆ ఎన్నిక‌ల్లో తేలింది. మైనార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డానికి తొలి రోజుల్లో కేసీఆర్ కొంత ఇబ్బంది ప‌డ్డాడు. అధికార‌ బ‌లంతో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి కేసీఆర్ ప్లాన్ చేశాడు. తొలుత తెలుగుదేశం పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేల‌ను విలీనం చేసుకున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌ను పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నాడు. దాదాపుగా అసెంబ్లీ వేదిక‌గా టీడీపీని తొలి అంకంలో జీరో చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్ప‌టికైనా దెబ్బ ఉంటుంద‌ని రెండో విడ‌త సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేసీఆర్ గ్ర‌హించాడు. దీంతో ఆ పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నాడు. కొంద‌ర్ని కోవ‌ర్ట్ లు పెట్టుకున్నాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా అసెంబ్లీ లోని ఎమ్మెల్యే సంఖ్య ఆధారంగా క‌నిపిస్తోంది. కానీ, తెలంగాణ పీసీసీగా రేవంత్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కాంగ్రెస్ దూకుడుగా వెళ్లింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా తీసుకెళ్ల‌డానికి రేవంత్ ప్లాన్ చేశాడు. ప్ర‌జ‌ల నుంచి అనూహ్య మ‌ద్ధ‌తు గిరిజ‌న‌, ద‌ళిత దండోరా స‌భ‌ల్లో క‌నిపించింది. జంగ్‌ సైర‌న్ పేరుతో నిర్వ‌హించిన నిరుద్యోగ స‌భ‌లు, వ‌రి ధాన్యం కొనుగోలుపై చేసిన వ‌రి దీక్ష‌లకు మ‌ద్ధ‌తు ల‌భించింది. దీంతో కాంగ్రెస్ పై కేసీఆర్ క‌న్నుప‌డింద‌ట‌.
హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జున సాగ‌ర్,ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఢీలా ప‌డ్డ బీజేపీని వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ తెర‌మీద‌కు తీసుకొచ్చాడ‌ని కాంగ్రెస్ అనుమానిస్తోంది. వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు టీఆర్ఎస్‌, బీజేపీ క్విడ్ ప్రో కో మాదిరిగా రాజ‌కీయ గేమ్ ను న‌డిపించాయ‌ని హ‌స్తం పార్టీ భావిస్తోంది. తాజాగా ఉద్యోగుల జోనల్ బ‌దిలీల కోసం విడుద‌ల చేసిన 317 జీవోను వ్య‌తిరేకిస్తూ బీజేపీ చేసిన రాత్రి జాగ‌ర‌ణ రాద్ధాంతం కూడా ఆ రెండు పార్టీల ఎత్తుగ‌డ‌గా పీసీసీ చీఫ్ రేవంత్ చెబుతున్నాడు. అదే నిజం అయితే…కాంగ్రెస్ పార్టీని చూసి కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నాడ‌ని అనుకోవాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉద్య‌మ‌కారులు, ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను ఆద‌రిస్తున్నారు. సోనియా గాంధీ సీరియ‌స్ గా తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చి ప్ర‌చారం నిర్వ‌హిస్తే, ఈసారి ఫ‌లితాలు మ‌రోలా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. దీంతో బీజేపీ పార్టీని కాంగ్రెస్‌కు స‌మాంత‌రంగా కేసీఆర్ తీసుకొస్తున్నాడ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని టాక్‌. ఒక‌ప్పుడు సోనియా దేవత అంటూ కీర్తించిన కేసీఆర్ ఇప్పుడు దెయ్యంగా భావిస్తున్నాడు. అంటే, ఎప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు రాజ‌కీయంగా దెబ్బ ఉంద‌ని గులాబీ లెక్కిస్తోందట‌. అందుకే, బీజేపీతో కేసీఆర్ ఆడుతోన్న గేమ్ పై కాంగ్రెస్ ఫోక‌స్ పెట్టింది. సో..కేసీఆర్ గేమ్ కు ఎలాంటి జ‌ల‌క్ రేవంత్ ఇస్తాడో చూద్దాం.!