BRS Formation : జెండా, ఎజెండాలో `తెలంగాణ‌` ను లేపేసిన కేసీఆర్

`తెలంగాణ`(Telangana) ప‌దాన్ని క‌నిపించ‌కుండా, వినిపించ‌కుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్ చేశారు.

  • Written By:
  • Updated On - December 9, 2022 / 03:01 PM IST

`తెలంగాణ`(Telangana) ప‌దాన్ని క‌నిపించ‌కుండా, వినిపించ‌కుండా జెండా,ఎజెండాను కేసీఆర్‌ ఫిక్స్ చేశారు. ఆయ‌న పెట్టుకున్న ముహూర్తం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1.20 నిమిషాల‌కు బీఆర్ ఎస్ (BRS)ను అధికారికంగా ప్ర‌క‌టించారు. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) జెండాను ఆవిష్క‌రించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి జెండాలోని తెలంగాణ (Telangana) మ్యాప్ ను తొల‌గించారు. ఆ స్థానంలో భార‌త్ చిత్ర‌ప‌టాన్ని ఉంచారు. జై తెలంగాణ బదులుగా జై భ‌ర‌త్ గా నినాదాన్ని పెట్టారు. కానీ, కారు సింబ‌ల్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

తొలి రోజుల్లో `జ‌లవిహార్` పేరుతో సాదాసీదాగా ఉండే భ‌వ‌నంలో తెలంగాణ ఉద్య‌మాన్ని కేసీఆర్ (KCR) ప్రారంభించారు. ఆ త‌రువాత ఉమ్మ‌డి ఏపీ ప్ర‌భుత్వం కేటాయించిన స్థలంలో ఆకాశ‌హార్య్మాన్ని నిర్మించి తెలంగాణ భ‌వ‌న్ గా నామ‌క‌ర‌ణం చేశారు. ఆ భ‌వ‌నం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ రాజ‌కీయ కార్య‌క్ర‌మాలు అన్నీ జ‌రిగాయి. ఇప్పుడు టీఆర్ఎస్ క్లోజ్ కావ‌డంతో పాటు తెలంగాణ చిత్ర‌ప‌టాన్ని, నినాదాన్ని జెండా, ఎజెండాల్లో తొల‌గించారు. కానీ, తెలంగాణ భ‌వ‌న్ ను భార‌త్ భ‌వ‌న్ గా మార్చాల్సి ఉంది. అలాగే, కారు గుర్తును పెట్టాల్సి ఉంది.

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కు గుర్తింపు తీసుకొచ్చేందుకు కేసీఆర్ నాలుగు రాష్ట్రాల్లో ఓటు బ్యాంకును సంపాదించాలి. రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాగూ బీఆర్ఎస్ గుర్తింపు వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ ప్రాంతీయ పార్టీగానే ఉండిపోతుంది. అదే, నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రాతినిధ్యాన్ని సాధిస్తే జాతీయ హోదా బీ ఆర్ఎస్ కు వ‌స్తుంది. అప్పుడే `కారు` గుర్తును జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయింపు ఉంటుంది. లేదంటే, స్వ‌తంత్ర్య సింబ‌ల్స్ ప్రాతిప‌దిక‌ను పోటీ చేయాల్సి ఉంటుంది.

ఇక తెలంగాణ రాష్ట్ర స‌మితి అనేది ముగిసిన అధ్యాయంగా ప‌రిగ‌ణించాలి. ఆ స్థానంలో బీఆర్ఎస్ ను గురువారం సరిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఈసీ లేఖపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంతకం పెట్టారు. ఆ త‌రువాత‌ బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వీరితో పాటు టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు. ఈ క్షణం నుంచి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. బీఆర్ఎస్ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఆవిర్భావం సంద‌ర్భంగా హాజ‌రైన ఇత‌ర రాష్ట్రాల లీడ‌ర్ల‌ను గ‌మ‌నిస్తే క‌ర్ణాట‌క‌లో రాబోవు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంద‌ని అర్థం అవుతోంది. మాజీ సీఎం కుమార‌స్వామి, ప్ర‌కాష్ రాజ్ ఇద్ద‌రూ ఆ రాష్ట్రానికి చెందిన వాళ్లే. ఏపీలోనూ బీఆర్ఎస్ ఎన్నిక‌ల రంగంలోకి దిగుతుంద‌ని ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక బీహార్ కేంద్రంగా ప్ర‌శాంత్ కిషోర్ పెట్టే పార్టీతో జ‌త క‌ట్ట‌డం ద్వారా అక్క‌డ బీఆర్ఎస్ పోటీ చేసే అవ‌కాశం ఉంది. వీటితో పాటు మ‌హారాష్ట్ర‌లోనూ శివ‌సేన‌తో క‌ల‌సి పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఇలా నాలుగు రాష్ట్రాల్లో పోటీచేసి జాతీయ స్థాయి గుర్తింపు పొంద‌డానికి కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేక వాదం వినిపిస్తూ సుదీర్ఘ పోరాటం చేసిన కేసీఆర్ ఇప్పుడు స‌మైక్య నినాదాన్ని అందుకోవ‌డం మ‌ర‌చిపోలేని మ‌లుపు.

Also Read:  Janasena : ప‌వన్ పై `వారాహి` తిరుగుబాటు!రంగుపై జ‌గ‌న‌న్న`సైన్యం` ఫైట్‌!!